కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిథర్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని వీడుతున్నందుకు తనకు బాధగా ఉందని చెబుతూనే… ఆయన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారు. కాగా…. కాంగ్రెస్ ని వీడిన ఆయన…. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీలోని బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశమని చెప్పాలి. ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమిపాలైనా బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకొని టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించింది. ఈ ఎన్నికలకు ముందే యాదాద్రి భువన్ గిరికి చెందిన మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నేత బూర నర్సయ్యగౌడ్ బీజేపీ కండుగా కప్పుకున్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీ పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాషాయదళం పావులు కదుపుతున్నది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిధ్దం చేసుకుంటోంది. త్వరలోనే మరికొంత మంది కీలక నేతు కాషాయం కండువా కప్పుకుంటారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు.