Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఓఆర్ఆర్పై జరిగిన కారు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
లాస్య మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. చాలా మంచి నాయకురాలిగా ఉన్న యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టమని తెలిపారు.