ప్రతిపక్షంలో కూడా మేము ఇమిడిపోతామని కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని పేర్కొన్నారు.
KTR: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు తేటతెల్లం అయ్యాయి. పూర్తి మెజారిటీతో కాంగ్రెస్(Congress) విజయం సాధించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ఆశించిన ఫలితం రాలేదన్నారు. 119 స్థానాలకు గాను ప్రజలు 39 స్థానాలలో గెలిపించారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత విశ్వాసంగా, విశ్వసనీయతతో పనిచేశామో ప్రతిపక్షంలో ఉన్నా అంతే విశ్వసనీయతతో పనిచేస్తామన్నారు. ఈ ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకుంటామని, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నారు. పార్టీ మొదలుపెట్టిన అప్పటి నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయని పేర్కొన్నారు. ఎంతో శ్రమించి తెలంగాణను సాధించుకున్నాము.. ప్రజల దీవేనలతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టాము సమర్థవంతంగా పనిచేశామని వెల్లడించారు.
ఫలితాలు కొంత నిరాశపరిచాయి.. అయినా బాధలేదని, రాజకీయాల్లో ఇవన్నీ సహజమన్నారు. నాయకులు, కార్యకర్తల కృషి, పోరాట ఫలితంగానే భారాసకు 39 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్రలో వందశాతం ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పనిచేస్తామన్నారు. మా పార్టీ శ్రేణులతో సహకరించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో స్థితప్రజ్ఞత చాలా అవసరమని, గెలిచినా.. ఓడినా ఓకేరకంగా తీసుకోవాలని కేసీఆర్ తమకు నేర్పారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని కేటీఆర్ పేర్కొన్నారు.