విద్యుత్ చట్టాలను డిస్కంలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ (Electricity Department) ఆదేశించింది. రిపేర్ కోసం కరెంట్ నిలిపివేస్తే పట్టణాల్లో 4-6, గ్రామాల్లో 6-8 గంటల్లో పునరుద్ధరించాలని తెలిపింది. కరెంట్ కోతకు 12 గంటల ముందే యూజర్లకు మెసేజ్ పంపాలంది. ట్రాన్స్ఫార్మర్ (Transformer) కాలిపోతే పట్టణాల్లో 24, గ్రామాల్లో 48 గంటల్లో పునరుద్ధరించాలని.. లేకుంటే ఒక్కో కనెక్షన్‌కు రూ.200 వరకు డిస్కంలు (Discs)ఫైన్ కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి విద్యుత్తు సరఫరా నిలిచిపోతే కచ్చితంగా 24 గంటల్లోగా, గ్రామాల్లో 48 గంటల్లో డిస్కం ఖర్చుతోనే మరమ్మతు చేయాలి. ఈ గడువులోగా మరమ్మతులు, సరఫరా పునరుద్ధరణ జరగకపోతే ఒక్కో కనెక్షన్‌కు రూ.200 వరకూ పరిహారం కింద డిస్కం చెల్లించాల్సి ఉంటుంది. నూతన కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు దాన్ని ఎప్పటిలోగా ఇస్తారనే సమాచారం ఇవ్వాలి.
సేవల సమాచారాన్ని డిస్కం వినియోగదారుల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ (SMS) ద్వారా తెలపాలి. బిల్లు ఎంత చెల్లించాలి, గడువు వివరాలతో మెసేజ్ పంపాలి. ట్రాన్స్ఫార్మర్ కాలినా, ఫ్యూజ్ పోయినా, తీగలు తెగినా, వోల్టేజ్(Voltage)లో హెచ్చుతగ్గులున్నా, వినియోగదారు ఇంట్లో మీటరు పనిచేయకున్నా, కాలినా, కొత్త కనెక్షన్ (new connection) ఇవ్వడంలో జాప్యం జరిగినా, కేటగిరీ మార్చాలన్నా, బిల్లులో తప్పులొచ్చినా, ఎక్కువ బిల్లు వచ్చినా, బకాయి కట్టిన వెంటనే సరఫరా పునరుద్ధరించకున్నా.. ఇలా ఏ సమస్య వచ్చినా తొలుత విద్యుత్ కార్యాలయం వద్ద ఉండే సేవా కేంద్రంలో తెలియజేయాలి. డిస్కం వెబ్సైట్లో లేదా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు. ఈ సేవలను తక్షణం అందించకపోతే ‘వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక’(CGRF)కు ఫిర్యాదు చేస్తే.. విచారణ జరిపి బాధితులకు పరిహారం ఇప్పిస్తుంది. సేవల్లో జాప్యం జరిగితే పరిహారం చెల్లించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని.. తాము సేవలను సకాలంలో, పక్కాగా అందిస్తున్నామని దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి(CMD Raghumareddy) తెలిపారు