హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీ చేసింది. దసరా సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నగా సిట్ భగ్నం చేసింది. జాహైద్, ఫారూఖ్, సమియుద్దీన్‌ను అరెస్ట్ చేసి.. చంచల్ గూడ జైలుకు తరలించింది. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ ఇప్పుడు కేసు నమోదు చేసింది.
పాకిస్థాన్, నేపాల్ మీదుగాపేలుడు పదర్థాలను మనోహరాబాద్‌కు తరలించారు. అక్కడి నుంచి జాహేద్ అనుచరుడు వాటిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. నగరంలో రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. కుట్రను పోలీసులు భగ్నం చేసి.. ముగ్గురిని అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు టార్గెట్‌గా ఈ ముఠా పేలుళ్లకు ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు.
15 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఓ హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. సీపీ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్ నిందితుడిగా ఉన్నాడు. ఆత్మాహుతి బాంబర్‌కు జాహేద్ ఆశ్రయం కల్పించినట్టు విచారణలో తేలింది. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జాహేద్ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగించాడు. పోలీసులు జాహెద్‌పై నిఘా ఉంచారు. హైదరాబాద్ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్నారు. గతేడాది అదుపులోకి తీసుకొని విచారించగా ఉగ్రకుట్ర విషయం తెలిసింది. అలా కుట్రను భగ్నం చేశారు. ఇప్పుడు ఆ కేసును ఎన్ఐఏ విచారించనుంది.