హైదరాబాద్ అశోక్‌నగర్(Ashoknagar)లోని గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.స్థానిక హాస్టల్లో ఉంటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. వరంగల్ (Warangal) జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (Marri pravaḷika) (23) శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే మనస్తాపంతో ఆమె సూసైడ్ చేసుకుందన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి వరకు మృతదేహం హాస్టల్(Hostel)లోనే ఉంది. ప్రవళిక రాసిన సూసైడ్ నోట్‌గా చెబుతున్నలెటర్ వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా.. నాన్న జాగ్రత్త!’ అంటూ ఆ లేఖలో ఉంది. భారీ ఎత్తున యువత రోడ్లపైకి రావడంతో మళ్లీ ఉద్యమ పరిస్థితులు గుర్తుకొచ్చాయి.
గ్రూప్-2 పరీక్షల(Group-II Exams) వాయిదా వేయడంతోనే ఆమె సూసైడ్ చేసుకుందని నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ప్రవళిక ఆత్మహత్య విషయం తెలియడంతో బీజేపీ ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్(K. Laxman)ఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని రాసిన సూసైడ్ లైటర్‌లో ఏం ఉందో చూపించాలని,హాస్టల్లోకి అనుమతించాలని పోలీసులను కోరారు.అందుకు పోలీసులు అనుమతించకపోడంతో అప్పటికే ధర్నా చేస్తున్న విద్యార్థలను, లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాత్రి 1.30 ప్రాంతంలో ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించారు. అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ దళాలను పోలీసులు రంగంలోకి దించారు.