అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంల కమిషనింగ్ పూర్తయిందన్నారు.
CEO Vikas Raj : అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంల కమిషనింగ్ పూర్తయిందన్నారు. ఈ నెల 29 నుంచి ఈవీఎంల పంపిణీ జరగనుంది. ఇప్పటికే హోం ఓటింగ్ పూర్తయిందని వివరించారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ అనుమతులు లక్షా 65 వేలకు గాను ఇప్పటి వరకు 95 వేలు పూర్తయ్యాయని తెలిపారు. హోం ఓటింగ్ 26 వేల ఓటింగ్ పూర్తయింది. 54 లక్షల 13 వేల ఎపిక్ ప్రింటింగ్ పూర్తయిందని, బిఎల్ఓ ద్వారా ఎపిఐసి కార్డులు పంపిస్తామని సిఇఒ వికాస్‌రాజ్ తెలిపారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా 2.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 50 వేల మంది టీఎస్ఎస్పీ, 3 వేల మంది ఎక్సైజ్ పోలీసులు, 45 వేల మంది తెలంగాణ పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి 24 వేల మంది హోంగార్డులను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వీరితో పాటు ఇప్పటికే 196 కేంద్ర బలగాలు రాగా, మరో 74 కంపెనీలు రానున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ చైర్, ఒక సిబ్బంది ఉంటారని తెలిపారు. ఇప్పటికే 80 వేల వీల్ చైర్లను జిల్లాలకు పంపించారు. 48 గంటల నుంచి ఎన్నికల వరకు కఠిన నిబంధనలు ఉంటాయన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. స్థానికేతరులు ఎన్నికలకు 48 గంటల ముందు నియోజకవర్గం వదిలి వెళ్లాలని సూచించారు. ప్రచారం ముగియగానే టీవీ, సోషల్ మీడియా ప్రకటనలు అనుమతించబడవు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 709 కోట్లు సీజ్ చేశారు. 290 కోట్ల వరకు నగదు ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.