మద్యం ప్రియులు మరోసారి రికార్డు బ్రేక్ చేశారు. మామూలు రోజుల్లోనే మద్యం విపరీతంగా అమ్ముడుపోతూ ఉంటుంది. అలాంటిది పండగ వస్తే.. మరింత అమ్ముడిపోవాల్సిందే. ముఖ్యంగా తెలంగాణలో దసరా పండగకు మద్యం ఏరులై పారాల్సిందే. ఈ ఏడాది దసరా కి కూడా అదే జరిగింది. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో మద్యం విక్రయాలు రూ.1,100 కోట్లు దాటాయి. గత ఏడు పనిదినాల్లో కలిపి ఈ మేరకు మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.
గత ఏడు పనిదినాల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది. వరంగల్ అర్బన్ (149.02 కోట్లు), నల్లగొండ (124.44 కోట్లు), కరీంనగర్ (111.44 కోట్లు), హైదరాబాద్ (108.24కోట్లు) జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయించారు.
ఇక దుకాణాలు, బార్లు, పబ్బులలో ఉన్న నిల్వ స్టాకుతో కలిసి ఇది రూ. 1100 కోట్లకు మించిందని అంచనాలున్నాయి. అయిదు రోజుల్లోనే రూ 685 కోట్ల మేర అమ్మకాలు జరగటం రికార్డుగా చెబుతున్నారు. గత ఏడాది ఈ అమ్మకాలు రూ.406 కోట్ల దాకా జరిగాయి. ఈ సారి దసరా తెలంగాణ ప్రభుత్వానికి అంచనా కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం తెచ్చి పెట్టింది.