CM Revanth Reddy : రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరపున ఎలాంటి కరెంటు కోత లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని, కరెంటుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగినప్పటికీ కోతలు పెడుతున్నారనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపై ఉందని ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
సచివాలయంలో గృహజ్యోతి, రూ.500కే సిలిండర్ పథకాలపై సమీక్షించే ముందు విద్యుత్ కోతలపై జరుగుతున్న ప్రచారంపై అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ రిజ్వీ సమాధానమిస్తూ.. గత రెండు నెలల్లో గతేడాది కంటే ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామన్నారు. ఇటీవల రాష్ట్రంలోని మూడు సబ్ స్టేషన్ల పరిధిలో కొంత సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అందుకు కారణాలు ఏంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సక్రమంగా పర్యవేక్షించాలని, వారు చేయకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు తెలియజేసారు.
నిర్లక్ష్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదైనా మరమ్మతులు, ఇతరత్రా పనుల నిమిత్తం సరఫరా నిలిపివేయాల్సి వస్తే ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు ముందుగా తెలియజేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి ఉద్దేశపూర్వకంగా కోత విధిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని సీఎం హెచ్చరించారు. ఎక్కడైనా ఐదు నిమిషాలకు మించి విద్యుత్తు సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణాలను వెంటనే విచారించాలన్నారు. సాంకేతిక, సహజ కారణాలతో తప్ప ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కోతలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లలో పీక్ సీజన్‌కు సరిపడా విద్యుత్ అందించేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. గతేడాది ఇదే కాలంలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అయ్యాయి. గతేడాది జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, ఈ ఏడాది జనవరిలో 243.12 మిలియన్ యూనిట్లకు పైగా సరఫరా జరిగింది.