CM KCR : మన్మోహన్ సింగ్ చేసిన పనులు కూడా మోదీ చేయలేదు.. అసెంబ్లీలో కేసీఆర్
ఆ తర్వాత కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా? కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారు. ప్రజలే చూసుకుంటారు ఆ తమాషాలు అన్నారు
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో మాట్లాడారు. బడ్జెట్ చర్చల అనంతరం.. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలు చెప్పారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ఆయన మండిపడ్డారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన పనులు కూడా మోదీ చేయలేదని కేసీఆర్ విమర్శించారు. 2014 లో ఏదో చేస్తడని మోదీకి అధికారం అప్పగిస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది ప్రజలు పరిస్థితి. మోదీ గెలిచాడు.. బీజేపీ పార్టీ గెలిచింది.. కానీ భారతదేశ ప్రజలు ఓడిపోయారని సీఎం కేసీఆర్ అన్నారు.
భారతదేశ ఓటమిలో భాగంగా తెలంగాణ కూడా కొంత మేరకు ఓడిపోయింది. తెలంగాణ జీఎస్డీపీ ఇవాళ రూ.13.27 కోట్లు. తెలంగాణ లెక్క భారత్ పనిచేస్తే జీఎస్డీపీ రూ.16 లక్షల కోట్లు ఉండాలి. కానీ.. ఒక్క తెలంగాణే రూ.3 లక్షల కోట్లను నష్టపోయింది. మన్మోహన్ సింగ్ హయానికి, నరేంద్ర మోదీ హయానికి చాలా తేడా ఉందన్నారు. ప్రతి రంగంలో ఇప్పుడు దేశం నష్టపోయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR : ఛోటే భాయ్ సుభానల్లా.. బడే భాయ్ మాషా అల్లా
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ వ్యవహారం.. ఛోటే భాయ్ సుభానల్లా, బడే భాయ్ మాషా అల్లా అన్నట్టుగా ఉందని సీఎం కేసీఆర్ సెటైర్ వేశారు. ఎన్నికలు జరిగినప్పుడు నాయకులు, పార్టీలు గెలుస్తున్నాయి కానీ.. ప్రజలు ఓడిపోతున్నారని ఇదే ఈ దేశం చేసుకున్న దురదృష్టకరం అన్నారు.
ఆ తర్వాత కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా? కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారు. ప్రజలే చూసుకుంటారు ఆ తమాషాలు అన్నారు. రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీలకు హైదరాబాద్ లో భవనాలు నిర్మిస్తామన్నారు.
అసెంబ్లీలో సబ్జెక్ట్ వదిలేసి ప్రతిపక్ష సభ్యులు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు కేంద్ర బడ్జెట్ లోనే తెలంగాణకు అన్యాయం జరిగింది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ. మనకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారు. మావి మాకు ఇవ్వండి అని ఏడేళ్ల నుంచి అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నరు కానీ.. కనీసం ఢిల్లీకి నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. పార్లమెంట్ లో ప్రధాని స్పీచ్ అధ్వానంగా ఉంది. అదాని గురించి ప్రధాని ఏం మాట్లాడలేదు. అదానీ రూపంలోనే ఉపద్రవం వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదిలేశారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకొచ్చింది.. అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ఈ లెక్కలు అవాస్తవమైతే రాజీనామా చేస్తా: కేసీఆర్
అదానీ అంశంపై ఎందుకు పార్లమెంట్ లో ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. దాన్ని వదిలేసి ఏదేదో ప్రసంగించారు. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై ప్రధాని ఎందుకు వివరణ ఇవ్వలేదు. అసలు మోదీ సర్కారు హయాంలో ఏ ఒక్క రంగమైన వృద్ధి సాధించిందా? మన్మోహన్ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.73 ఉంటే.. ఇప్పుడు 7.1 శాతంగా ఉంది. పారిశ్రామిక వృద్ధి రేటు అప్పుడు 5.87 గా ఉంటే.. ఇప్పుడు 3.27 శాతంగా ఉంది. మేకిన్ ఇండియా ఎటుపాయె. విశ్వగురు ఎటుపాయె. నేను చెప్పిన లెక్కల్లో ఒక్క మాట అబద్ధం ఉన్నా వెంటనే రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ తెలిపారు.