కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. విద్యుత్ సమస్య గురించి స్థానికులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇష్యూను అక్కడికక్కడే పరిష్కరించాలని భావించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా… వారు అందుబాటులో లేరు. దీంతో ఆయన అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమస్యల గురించి తెలుసుకునేందుకు తాము ప్రజల మధ్య తిరుగుతున్నామని పేర్కొన్నారు. మీరు మాత్రం సమాచారం ఇచ్చిన రావడం లేదని మండిపడ్డారు. బస్తీల్లో మంచినీటి పైప్ లైన్ కోసం తీసిన కాలువలు పూడ్చాలని అధికారులను ఆదేశించారు.
అంబర్ పేట అసెంబ్లీ స్థానం సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు అంబర్ పేట నుంచి గెలుపొందారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక జరగనుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలలో లోక్‌సభకు ఎన్నిక జరగాల్సి ఉంది. ప్రధాన పార్టీల నేతలు ప్రజల్లో ఉంటున్నారు. వారి బాటలోనే కిషన్ రెడ్డి నిలిచారు. తన నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేపట్టగా, అధికారులు లేకపోవడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు.