టికెట్ దక్కనివారిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ (BRS) ప్రయత్నిస్తోంది.స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) కు కాకుండా కడియం శ్రీహరికి టిక్కిట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో రాజయ్య తో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ హన్మకొండలోని ఆయన ఇంటికి వెళ్లారు. రాజయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో కాసేపు అక్కడే వేచి చూసి వెళ్లిపోయారు. కాగా రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం ఇస్తుందని పల్లా తెలిపారు.ఇటీవల సీఎం కేసీఆర్ (CMKCR) తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 115 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు.
ఏడు స్థానాలు మినహా మిగతా అన్నిచోట్లా సిట్టింగ్‌లకు అవకాశం దక్కింది.అయితే స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం టిక్కెట్ దక్కలేదు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari)కి పార్టీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే రాజయ్య ఆవేదనకు లోనయ్యారు. అయినప్పటికీ తాను కేసీఆర్ గీసిన గీత దాటనని, ఆయన చెప్పినట్లు వింటానని అన్నారు. రాజయ్య నిన్న పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ భోరున విలపించారు. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఆయన వద్దకు పల్లాను పంపించింది. మరోవైపు, పాలేరు (Paleru) టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) కు కూడా టిక్కెట్ రాలేదు. దీంతో ఆయన వద్దకు ఎంపీ నామా (MP Nama) నాగేశ్వరరావును పంపించారు. సీఎం ఆదేశాల మేరకు తుమ్మలతో చర్చించినట్లు నామా తెలిపారు