తెలంగాణలో మంచిర్యాల జిల్లా (Manchryala District) చెందిన ఓ వ్యక్తికి వృషణాలు లేవు. ఆ వ్యక్తి 40 ఏళ్లుగా అలాగే ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, కానీ ఎంతకీ పిల్లలు పుట్టడంలేదు. గుళ్లూ, గోపురాలు తిరిగినా ఫలితం లేదు. అయితే కొన్ని రోజుల నుంచి పొత్తి కడుపు కింద విపరీతమైన నొప్పి వేధించడం మొదలు పెట్టింది. దీంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రి(Kim’s Hospital)లో చేరాడు. వైద్యులు ఆ వ్యక్తికి అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్ఐ (MRI) వంటి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు రెండూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. జెనెటిక్ (Genetic) మ్యూటేషన్ (జన్యు ఉత్పరివర్తనం) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు తేల్చారు. సాధారణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అనేది నిర్ణయం అయిపోతుంది.
అయితే మంచిర్యాల వ్యక్తి విషయంలో మాత్రం జన్యు ఉత్పరివర్తనం కారణంగా.. హార్మోన్ల (Hormonal) అసమతుల్యత ఏర్పడి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్పడ్డాయి. అతనిలో పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ వృషణాలు పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉండిపోయినట్టు, స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్ (fallopian) ట్యూబ్లు, స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించాం. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్ ట్యూబులు, గర్భసంచి(womb), స్త్రీ జననాంగం తొలగించాం’ అని డాక్టర్ ప్రశాంత్ వెల్లడించారు.ఇలాంటి వారిలో వృషణాలు ఉదర భాగంలో ఉండిపోవడం వల్ల వీర్య కణాలు ఉత్పత్తి కావు. పిల్లలు పుట్టరు’ అని డాక్టర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ తరహా కేసులు 300 వరకు నమోదయ్యాయని, మన దేశంలో 20 వరకు గుర్తించారని ఆయన వివరించారు.