ఐఫోన్ యూజర్ల (iphone users)కు యాపిల్ (Apple company) హెచ్చరికలు జారీ చేసింది. సెల్‌ఫోన్‌కు సమీపంలో నిద్రించడం వల్ల ఇప్పటి వరకూ అనేక ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. చాలా మంది సెల్‌ఫోన్ బ్యాటరీ పేలడం వల్ల మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఐఫోన్ల తయారీ కంపెనీ అయిన యాపిల్ కూడా తమ యూజర్లకు కీలక సూచన చేసింది. ఫోన్ ను పక్కనే పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉన్నవారు ఇకపై అలా చేయొద్దని తెలిపింది.
ఛార్జింగ్ (Charging) పెట్టి ఫోన్ పక్కనే పడుకోవద్దని యాపిల్ హెచ్చరికలు (Apple warning) జారీ చేసింది. ఇంకా మరికొన్ని విషయాలను ఆన్లైన్ యూజర్ గైడ్ (Online User Guide)లో చెప్పింది. ఐఫోన్లను బాగా వెలుతురు ఉండే వాతావరణంలో, టేబుల్ వంటి ఫ్లాట్ ఉపరితలాలలపై పెట్టి ఛార్జింగ్ ఉంచాలని ఐఫోన్ సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఛార్జింగ్ పెట్టొద్దని వెల్లడించింది.
ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఆ వేడిని సులభంగా విడుదల చేయలేనప్పుడు ఫోన్ కింద ఏండే భాగం కాలిపోయే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిసార్లు తీవ్రమైన సందర్భాల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఆ పరికరం, పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్‌పై నిద్రించకూడదని, పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచకూడదని హెచ్చరించింది. అలాగే దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను ఉపయోగించొద్దని, తేమగా ఉంటే ఛార్జింగ్ చేయకూడదని యాపిల్ సంస్థ తమ యూజర్లకు జాగ్రత్తలు తెలిపింది.