»Bjp Mla Etala Rajender Criticized Kcr In Huzurabad Campaign
Etala Rajender: కేసీఆర్ 1700 మంది కార్మికులను డిస్మిస్ చేసిండు
హుజూరాబాద్ సభలో కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఈటల రాజేందర్...ఏ జాతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీ ముందుకొచ్చిందని అన్నారు. 2009లోనే ప్రధాని మోడీ తెలంగాణకు సపోర్ట్ చేశాడన్నారు. తెలంగాణ చిన్నమ్మగా పిలువబడిన సుష్మాస్వరాజ్ సేవలను గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఆనాడే ఎదిరించినట్లు ఈటల వెల్లడించారు.
BJP MLA Etala Rajender criticized KCR in Huzurabad campaign
Etala Rajender: తెలంగాణ(Telangana)కు 2007లోనే బీజేపీ(BJP) అనుకూలంగా తీర్మానం చేసిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 2014లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించిన ఘనత బీజేపీ పార్టీదని, ఆ సమయంలో రాజ్ నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారని హుజూరాబాద్ జనగర్జన సభలో ఈటల అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు ముఖ్యం అని చెప్పింది జనసంఘ్ పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లు ఎలాంటి ప్రాముఖ్యత వహించారో అందరికీ తెలుసని తెలిపారు.
ఏ రాజకీయ నేపథ్యం లేని రోజున కమలాపురం ఓటర్లు తనను 25వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. హుజూరాబాద్(Huzurabad) నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. తన చిన్నతనంలో అనుభవించిన చేదు జ్ఙాపకాలను గుర్తుపెట్టుకుని, తాను మంత్రినయ్యాక హాస్టల్‌కు సన్నబియ్యం ఇచ్చినట్లు తెలిపారు. ఇక కరోనా సమయంలో వైద్యారోగ్యశాఖమంత్రిగా ఆయన చేసిన పనులను గుర్తుచేసుకున్నారు. తాను మందు ఇచ్చే స్థాయిలో లేకపోవచ్చు. సూదిచ్చేస్థాయిలో లేకపోవచ్చు.. కానీ ధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నానని అన్నారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రికి వెళ్లి మొట్టమొదటి కరోనా పేషెంట్ భుజం తట్టి ధైర్యం చెప్పానని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు బిక్కుబిక్కుమంటూ ఉంటే అలాంటి సమయంలో గాంధీ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రికి తిరిగిన వ్యక్తిని తానేనని అన్నారు.
2015లో మున్సిపల్ కార్మికులు వేతనాలు పెంచమని సమ్మె చేస్తే కేసీఆర్ 1700 మంది కార్మికులను డిస్మిస్ చేసినట్లు గుర్తు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అని తాను కేసీఆర్‌ను అడిగానని, వాళ్లు నోరులేని కార్మికులు అని, వాళ్లను డిస్మిస్ చేయవద్దని చెప్పినందుకే ఆయన నామీద కుట్రపన్నారని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటలను ఓడించాలని, ఎన్ని ఎత్తులు వేశారో ప్రజలకు తెలుసని చెప్పారు. డబ్బు, మద్యంతో కాదు కేవలం ప్రజల ప్రేమతోనే తాను గెలిచానని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.