తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హాట్ టాపిక్ గా మారారు. భగీరథ్ కాలేజీలో తోటి విద్యార్థిని కొడుతూ.. బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భగీరథ్ ని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన పలు రాజకీయ పార్టీల నేతలు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆర్జీవీ సైతం భగీరథ్ ని నియంత అంటూ ట్వీట్ చేశాడు.
భగీరథ్ చదువుతున్న మహీంద్ర యూనివర్సిటీ అతడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు భగీరథ్ పై కేసు నమోదైంది. విద్యార్థులపై దాడికి పాల్పడ్డ భగీరథ్ మీద ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ కి సంబంధించిన రెండు వీడియోలు బయటకు రాగా.. రెండింటిలోనూ అతను వారిని కొడుతూ, బెదిరిస్తూ కనిపించాడు. అయితే.. మొదటి వీడియోలో దెబ్బలు తిన్న విద్యార్థి తప్పంతా తనదేనని, అమ్మాయిని ఏడిపించడం వల్లే భగీరథ్ తనను కొట్టాడని చెప్పాడు. రెండో వీడియోకు సంబంధించిన బాధితుడు స్పందించలేదు.