SI Exam: ఎస్సై పరీక్ష రాయడానికి హైదరాబాద్ వచ్చిన ఓ కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు అనీల్ గౌడ్. అతను ఎస్సై పరీక్ష రాసేందుకు శుక్రవారం శ్రీకృష్ణనగర్‌లో నివసించే సోదరుడు, సీఆర్ కానిస్టేబుల్ అనంతం గౌడ్, గ్రూప్స్ పరీక్షకు సిద్ధమవుతున్న మరో సోదరుడు శ్రీనివాస్ ఉండే గదికి వచ్చారు. శనివారం రెండు పరీక్షలు రాశారు. రాత్రి కూరలు తెచ్చు కొనేందుకు ముగ్గురు కలిసి నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరికి అతి దగ్గరగా వెళ్లడంతోచూసుకొని వెళ్లొచ్చు కదా అంటు అనిల్ గౌడ్ అరిచాడు. కారు ఆపిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా వారి ముగ్గురిపై దాడి చేసి గాయపరిచారు.
ఫోన్ చేసి కొందరిని రప్పించి గుంపుగా వీరిపై విరు చుకుపడ్డారు. దాడి ఘటనలో అనిలుగౌడ్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు సోదరులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అనిల్ గౌడ్ ఆదివారం రాయాల్సిన రెండు పరీక్షలకు హాజరుకాలేకపోయారు. ఘటనపై అనంతం అనిల్ గౌడ్ బంజారాహిల్స్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. తొలుత దాడికి పాల్పడిన శ్రీకృష్ణనగర్ ప్రాంతానికి చెందిన జుబేర్, సయ్యద్ తన్వీర్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. గుంపుగా వచ్చిన వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పోలీ సులు పరిశీలిస్తున్నారు. ఘటనపై ఐపీసీ సెక్షన్ 279, 325, 341, 367, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.