తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరాల్సిన ఆదాయంలో రూ.40వేలకోట్లకుపైగా తగ్గుదల నమోదైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి కి కేసీఆర్ ఆదేశించారు.ఈ సమావేశాల్లో తెలంగాణపై ప్రధాని మోదీ సర్కార్ వైఖరిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్ల రాష్ట్రం.. రూ.40 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం చేస్తున్న పనులను ఎత్తి చూపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈడీ, ఐటీ దాడులను ఈ సమావేశాల్లో కేసీఆర్ ఎండగట్టే అవకాశం ఉంది.