»Another Twist In Tspsc Leakage Case Two More Arrested Total Members 17
TSPSC లీకేజీ కేసులో మరో ట్విస్ట్..ఇంకో ఇద్దరు అరెస్ట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో మరో ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిద్దరిని లౌకిక్, సుష్మితగా గుర్తించారు. లౌకిక్ సాయి తన భార్య సుష్మిత కోసం ప్రధాన అనుమానితుడైన ప్రవీణ్ నుంచి DAO పరీక్ష ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు. సిట్ విచారణలో గతంలో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు(police) వారిని అరెస్టు చేశారు.
TSPSC పేపర్ లీక్ కేసు(TSPSC leakage case)లో సిట్(SIT) బృందం స్పీడ్ పెంచింది. ఈ కేసులో ఒక్కొక్కరిని విచారిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న నిందితులు అందించిన సమాచారం మేరకు సాయి లౌకిక్, సుస్మితలను అదుపులోకి తీసుకున్నారు. అయితే సుస్మితకు రూ.6 లక్షలు చెల్లించి సాయి లౌకిక్ ప్రవీణ్ నుంచి డీఏవో పరీక్ష (డీఏవో) పేపర్ కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో అరెస్టయిన వారి సంఖ్య 17కి చేరింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ మెరిట్ జాబితాను సేకరించిన సిట్ బృందం.. 100 మార్కులకు పైగా సాధించిన 121 మంది అభ్యర్థులను విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వారి సామర్థ్యాలను, ప్రతిభను పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలను వారి ముందు ఉంచి ఏ సమయంలో సమాధానాలు రాశారు అనే వివరాలను ఆరా తీసింది. అదే సమయంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్, షమీమ్, రమేష్, సురేష్‌లకు కూడా సంబంధం ఉన్నట్లు తేలింది. మరోవైపు జగిత్యాల జిల్లాలో మెయిన్స్‌లో అర్హత సాధించిన 40 మంది అభ్యర్థులను SIT పరిశీలించి నివేదిక సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఈ నెల 11వ తేదీన సీల్డ్ కవర్లో హైకోర్టుకు సిట్(SIT) నివేదిక సమర్పించనున్నారు. ఇంకోవైపు ఈ కేసులో అరెస్టయిన 15 మందిలో చివరి ముగ్గురు నిందితులు ప్రశాంత్, తిరుపతయ్య, రాజేంద్రకుమార్‌ల పోలీసు(police) కస్టడీ గురువారంతో ముగియగా, వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ప్రశ్నపత్రాన్ని ఈ ముగ్గురు ఎంతమందికి అమ్మారు సహా తదితర వివరాలను సిట్ అధికారులు మూడు రోజుల పాటు విచారించి వాంగ్మూలాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.