»Pm Modi Asked Only If Kcr Family Gets Better Developed In The Telangana 2023
PM Modi: రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడితేనే చాలా
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI).. బీఆర్ఎస్ ప్రభుత్వం సహా సీఎం కేసీఆర్(CM KCR)పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడితేనే చాలా అంటూ మోదీ ప్రజలను ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో కేంద్రం చేపట్టిన అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో ఆలస్యమవుతున్నట్లు గుర్తు చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు తీరని నష్టమని మోదీ గుర్తు చేశారు. ఈ క్రమంలో అభివృద్ధి పనుల్లో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. అంతేకాదు తమ ప్రభుత్వం 7 మెగా టెక్స్టైల్ పార్కులను రూపొందించాలని నిర్ణయిస్తే.. వాటిలో ఒకటి తెలంగాణలో కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
మరోవైపు అవినీతి పరులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలా వద్దా అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు. అవినీతిపరులకు నిజాయితీతో పనిచేసే వారంటే భయం పట్టుకుందని అన్నారు. అంతేకాదు తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ రాజకీయ పార్టీ నేతలు తమ అవినీతి అక్రమాలను ఎవరూ తెరవకుండా రక్షణ కోసం కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. ఆ క్రమంలో కోర్టు కూడా వారికి కూదరదని చెప్పినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర సీఎం రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అభివృద్ధి కోసం పగలు రాత్రి పని చేస్తుంటే మరికొంత మంది మాత్రం వాటి వల్ల తట్టుకోలేకపోతున్నారని గుర్తు చేశారు. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్రప్రభుత్వం బాధపడుతోందని మోదీ అన్నారు. దీంతోపాటు ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టినట్లు మోదీ చెప్పారు. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని వెల్లడించారు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఐటి సిటీ, హైదరాబాద్‌ను వేంకటేశ్వర స్వామి నివాసం, తిరుపతితో కలుపుతుంది. మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ నుంచి ప్రారంభించబడిన రెండో వందే భారత్ రైలు ఇది. దీంతోపాటు ప్రధాని మోదీ రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.