Virat Kohli: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ తొలి రెండు మ్యాచ్ల నుంచి తప్పించాలని బోర్డుకు విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా.. వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ రెండు మ్యాచ్ల కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మొదటి ప్రాధాన్యమే అయినా.. వ్యక్తిగత తప్పని పరిస్థితుల కారణంగా రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండలేనని కోహ్లీ బోర్డుకి తెలిపాడు.
కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు గౌరవించింది. అతని వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు చేయెద్దని.. మీడియా, అభిమానులను కోరింది. మరి కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేదెవరో సెలెక్షన్ కమిటీ ఇంకా వెల్లడించలేదు. ప్రధానంగా రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ ఉంది. పటీదార్ ఇటీవల భారత్-ఎ తరపున ఇంగ్లాండ్తో అనధికార టెస్టులో 151 పరుగులు చేశాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ అర్ధశతకం సాధించాడు. వెటరన్ బ్యాటర్ పుజారా పేరు కూడా వినిపిస్తోంది. మరి కోహ్లా స్థానంలో ఎవరు ఆడతారో చూడాలి.