Netherlands: వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఆప్ఘనిస్థాన్ చిత్తు చేసింది. ఆ తర్వాత నిన్న బలమైన సౌతాఫ్రికా టీమ్‌ను ఆరెంజ్ ఆర్మీ నెదర్లాండ్స్ (Netherlands) ఓడించింది. ధర్మశాలలో వర్షం వల్ల మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 8 వికెట్లు కోల్పోయి 245 రన్స్ చేసింది. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు.. ఆరెంజ్ ఆర్మీ బౌలర్ల ముందు చతికిల పడ్డారు.
మరో బంతి మిగిలి ఉండగానే సఫారీ జట్టు అలౌట్ అయ్యింది. 207 పరుగులు చేసి ఓటమిని ముట్టగట్టుకుంది. 38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ (Netherlands) జట్టు ఘన విజయం సాధించారు. నెదర్లాండ్స్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారు. వాక్ బీక్ మూడు వికెట్లు తీసి.. దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు. వాన్ వీకెరన్, వాన్ డెర్ మెర్వ్, బాస్ డీ లీడ్ తలా రెండు వికెట్లను తీశారు. అకెర్ మన్ ఒక వికెట్ పడగొట్టాడు.
వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న సఫారీలు.. మూడో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై మాత్రం ఓడిపోయారు. మిల్లర్, 45, క్లాసెన్ 28, కోట్జీ 22, డికాక్ 20 పరుగులు చేశారు. చివరలో కేశవ్ మహారాజ్ ఒంటరి పోరాటం చేశారు. 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ బాది 40 పరుగులు చేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. సఫారీ జట్టు ఓటమి ఖరారైంది. ఈ మ్యాచ్‌లో డికాక్, మార్క్రమ్, బవుమా, డుస్సెన్, క్లాసెన్ రాణించలేదు. అందుకే డచ్ జట్టు సునాయస విజయం నమోదు చేసింది.