Mohammed Siraj's aggressiveness...India has a huge lead over West Indies
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్(Port of Spain)లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్(West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు మరోసారి సత్తా చాటింది. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 255 ఆలౌట్ కావడంతో భారత్‌కు 183 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాత్ వైట్(75)తో రాణించగా టగ్ నరైన్ చంద్రపాల్ (33), మెకంజీ(32)లు చేశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు దూకుడు కనబరిచారు. స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) 5 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్, రవీంద్ర జడేజా చెరో రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఓవర్ నైట్ స్కోరు 229/5 తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన వెస్టిండీస్ మరో 26 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 5 వికెట్లను కోల్పోయింది. ఆట ఆరంభమైన మొదటి ఓవర్లోనే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అథనేజ్(37) ఎల్భీగా ఔట్ అయ్యాడు. దీంతో విండీస్ ఓవర్ నైట్ స్కోరు వద్దే ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత నుంచి సిరాజ్ మాయ మొదలైంది. తనదైన పేస్‌తో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లే పెవిలియన్‌కు చేర్చాడు. మిగిలిన నాలుగు వికెట్లను అతడే పడగొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.