IND vs ENG: రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. నాల్గవ టెస్టులో భారత జట్టు విజయం సాధించడం ద్వారా ఐదు మ్యాచుల సిరీస్‌ను 3-1 తేడాతో నెగ్గినట్లయింది. నాల్గవ టెస్టు నాల్గవ రోజునే టెస్టు సిరీస్ ఫలితం తేలిపోయింది. 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 192 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు మూడో రోజు ఆట పూర్తయ్యే నాటికి 40 పరుగులు చేసింది. నాల్గవ రోజున 152 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగింది. లంచ్ విరామానికి 118 పరుగులకు చేరుకున్న భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 55 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేశాడు.
రజత్ పటీదార్ మరోసారి నిరాశ పరిచాడు. పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు. లంచ్ విరామం తర్వాత కూడా త్వరత్వరగా రెండు వికెట్లు పడిపోయాయి. రవీంద్ర జడేజా కేవలం 4 పరుగులే చేయగా సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత అభిమానుల్లో అలజడి రేగింది. అప్పటికే క్రీజులో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు, ధృవ్ జురెల్ జతకలిశాడు. ఇద్దరూ కలిసి మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. 72 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. శుభమన్ గిల్ 52 పరుగులు చేయగా, ధృవ్ జురెల్ 39 పరుగులు చేశాడు. వీరిద్దరూ అజేయంగా నిలిచి భారత జట్టుకు విజయాన్నందించారు.
ఈ సిరీస్‌లో మొదటి టెస్టులో ఓటమి చెందిన భారత జట్టు.. అక్కడి నుంచి వరుసగా మూడు టెస్టు మ్యాచులను నెగ్గింది. సత్తా చాటుకుంది. సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా యంగ్ సెన్సేషన్ ధృవ్ జురెల్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో క్లిష్ట సమయంలో 90 పరుగులు చేసిన జురెల్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటుకున్నాడు. 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.