IND vs ENG: విజృంభించిన టీమిండియా బౌలర్లు..100పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. ఈ జైత్రయాత్రలో నేడు మరో విజయాన్ని పొందింది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత్ బౌలర్లకు తలవంచింది. టీమిండియా బౌలర్లు చెలరేగారు. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ తడబడింది.
టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 52 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 100 పరుగులకే 8 వికెట్లను ఇంగ్లండ్ పోగొట్టుకుంది. అలాగే 129 పరుగులకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోరూట్, బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యారు. బెయిర్ స్టో 14, డేవిడ్ మలాన్ 16, కెప్టెన్ జోస్ బట్లర్ 10 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇకపోతే లియామ్ లివింగ్ స్టోన్ 27 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశాడు.
టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 87 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 49, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. ఇకపోతే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యి అభిమానులను నిరాశ పరిచాడు. శుభ్‌మన్ గిల్ 9, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా మార్క్ వుడ్ ఓ వికెట్ సాధించాడు.