20ట్వీంటీ ప్రపంచ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుకు బంగ్లాదేశ్ తొలిసారి షాకిచ్చింది. పొట్టి క్రికెట్ లో ఇంగ్లాండ్ పైన మొదటిసారి అద్భుత విజయం సాధించింది. స్వదేశంలో మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా తొలి 20ట్వంటీలో శుభారంభం చేసింది బంగ్లా టీమ్. చట్గావ్లో జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కానీ బంగ్లాదేశ్ మాత్రం కేవలం 18 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేధించింది.
ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ 38 పరుగులు చేశాడు. వీరు తొలి వికెట్ కు 80 పరుగులు జోడించి, శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ, బంగ్లా బౌలర్లు రాణించడంతో ఆ తర్వాత ఇంగ్లాండ్ 156 పరుగులే చేసింది. 157 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. బంగ్లా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్ కు షాకిచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నజ్ముల్ హొసైన్ 30 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. కెప్టెన్ షకీబల్ హసన్ 34 పరుగులు (నాటౌట్), రనీ తాలుక్దార్ (21), తోహిద్ హృదయ్ (24) పరుగులు చేశారు. రెండో ట్వంటీ 20 మ్యాచ్ ఈ నెల 12న ఢాకాలో జరగనుంది.