»A 9 Year Old Girl Tanvi Participates In The Billiards World Championship
Champion: తొమ్మిదేళ్లకే ప్రపంచ టోర్నీలో.. తన్వీ ఘనత
ఎంతో ఏకాగ్రత అవసరమైన బిలియర్డ్స్‌లో 9ఏళ్ల బాలిక సత్తా చాటుతుంది. వయస్సులో తన కంటే ఎన్నో ఏళ్లు పెద్దయిన వాళ్లతో ప్రపంచ ఛాంపియన్ షిప్లో పోటీ పడుతుంది. ఇంతకీ ఎవరు ఆ బాలిక తెలుసుకుందాం.
Champion: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టు 9ఏళ్ల వల్లెం తన్వీ క్యూ పట్టి బాల్స్ గురి చూసి కొడుతుంది. వయస్సు తక్కువే.. కానీ అమ్మమ్మ వయస్సు వాళ్లతో పోటీగా అంతర్జాతీయ టోర్నీల్లో ఆడుతోంది. హైదరాబాద్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన తన్వీ.. ఏకాగ్రత అవసరమైన బిలియర్డ్స్‌లో గట్టి పోటీనిస్తుంది. సరదాగా నేర్చుకున్న ఆటలో ప్రతిభ కనబరుస్తుంది. ఈ నెల అక్టోబర్ 19 నుంచి 22 వరకు ఆస్ట్రియాలో జరిగే ప్రతిష్ఠాత్మక ‘ప్రిడేటర్ డబ్ల్యూపీఏ ప్రపంచ 10 బాల్ సీనియర్ ఛాంపియన్షిప్’లో తన్వీ పోటీ పడనుంది. ఈ టోర్నోలో ఆడబోయే అతి పిన్న వయస్సురాలు తన్వీనే.
తొమ్మిదేళ్ల వయస్సులో ఆట ఆడటమే ఎక్కువ అంటే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడుతుందంటే మామూలు విషయం కాదు. ఈ పోటీలో తన్వీ 9 బాల్ ఫార్మాట్ నుంచి 10 బాల్ ఫార్మాట్‌కు మారింది. ఇంతకు ముందు ఫ్యూర్బోరికోలో జరిగిన 9 బాల్ ప్రపంప ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. ఇందులో ఆడిన పిన్న వయస్సురాలిగా తన్వీ రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఇంకో రికార్డు కోసం ఎదురు చూస్తోంది. 2022లో తొలి అంతర్జాతీయ టోర్నీలో ఆడి అండర్-17 విభాగంలోనూ తన్వీ సత్తా చాటింది. ఇంట్లో సరదాగా ఆడుతూ పూల్ టేబుల్‌ను చూసి ఆకర్షితరాలైన తన్వీ కొన్ని రోజుల్లోనే గురి చూసి కొట్టడం నేర్చుకుంది. ఈ వయస్సులో పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తూ.. చెప్పిన మాట వినరు. కానీ తన్వీ మాత్రం ఎంతో ఏకాగ్రత అవసరమైన ఈ బిలియర్డ్స్‌లో ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు కొనసాగుతోంది. త్వరలో ఆమె సీనియర్ విభాగంలోనూ సత్తా చాటనుంది.