Old Parliament చరిత్ర.. అమల్లోకి వచ్చిన చట్టాలు ఇవే
పాత పార్లమెంట్ భవనం.. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు వేదికగా నిలిచింది. మరెన్నో చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రావడం.. సమావేశాలు జరగడంతో పాత భవనం మూగబోయింది.
Old Parliament: నవ భారత నిర్మాణంలో, ఎందరో మహనీయుల ప్రసంగాలకు, స్వాతంత్య్ర భారత ప్రస్థానంలో ప్రతి మలుపుకు నిలువెత్తు సాక్ష్యం ఈ గుండ్రాకారపు రాజసం ఒలికించే పాత పార్లమెంట్ భవనం (Old Parliament). ఎన్నెన్నో చారిత్రాత్మక నిర్ణయాలకు – సంచలన చట్టాలకు వేదికగా నిల్చిన పార్లమెంట్ పాత భవనం (Old Parliament) విశేషాల్లోకి తొంగిచూస్తే …
వందేళ్ల చరిత్ర
దేశంలో ఇప్పుడున్న పాత పార్లమెంట్ భవనానికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. రాజసం ఒలికిస్తూ ఠీవిగా నిలబడిన పార్లమెంట్ భవనాన్నిడిజైన్ చేసిన బ్రిటీషు ఆర్కిటెక్చర్లు ఎడ్విన్ లూటియన్స్ , హెర్బర్ట్ బేకర్. దేశానికి కొత్త పరిపాలనా రాజధాని నిర్మించే ఉద్దేశంతో బ్రిటీషు ప్రభుత్వం 1912-13 రూపకల్పన జరిగింది. ఇక ఈ నిర్మాణం 1921లో ప్రారంభమై 1927లో పూర్తయింది.
ఐదేళ్లలో నిర్మాణం
ప్రిన్స్ ఆర్ధర్, డ్యూక్ ఆఫ్ కన్నాట్ అండ్ స్ట్రెయిట్ హెమ్ 1921 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుంది. 1927 జనవరి 18వ తేదీన ప్రారంభోత్సవానికి రావల్సిందిగా భారత వైస్రాయ్ జనరల్ లార్డ్ ఇర్విన్‌ను అప్పటి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు భూపేంద్రనాథ్ మిత్రా ఆహ్వానించారు. 1927, జనవరి 19వ తేదీన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మూడవ సెషన్‌తో పార్లమెంట్ భవనం ప్రారంభమైంది. ఆ తరువాత డిమాండ్ దృష్టిలో ఉంచుకుని 1956లో మరో రెండు అంతస్థులు నిర్మించారు. ప్రస్తుత పాత పార్లమెంట్ సీటింగ్ సామర్ధ్యం 790 సీట్లు.
వృత్తాకారంలో భవనం
పాత పార్లమెంట్ ఆకారం వృత్తాకారంలో గుండ్రంగా ఉంటుంది. బిల్డింగ్ మధ్యలో వృత్తాకారంలో సెంట్రల్ ఛాంబర్ ఉంటుంది. చుట్టూ మూడు అర్ధ వృత్తాకార హాల్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ లేదా ఇప్పటి లైబ్రరీ, రెండవది స్టేక్ కౌన్సిల్ లేదా ఇప్పటి రాజ్యసభ, మూడవది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా ఇప్పటి లోక్‌సభగా ఉన్నాయి. 1927 నుంచి 1947 వరకూ అంటే 20 ఏళ్లపాటు ఇప్పటి పార్లమెంట్ భవనానికి యజమానిగా బ్రిటీష్ ఇండియా ఉంది. ఇక 1950 నుంచి భారత ప్రభుత్వం యాజమాన్య హక్కులను పొందింది.
75 ఏళ్లుగా చట్టాల అమలు
1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని తరలించేందుకు ఆనాటి బ్రిటీషు పాలకులు నిర్ణయించాక 1921లో సెక్రటేరియట్ బిల్డింగ్‌లో భారీ చాంబర్ నిర్మించారు. అనంతరం ఆర్కిటెక్చర్లు ఎడ్విన్ ల్యూటిన్ రూపొందించిన వృత్తాకార డిజైన్ ఖరారు చేశారు. 1927 జనవరి 19వ తేదీన అప్పటి భారత వైశ్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో 144 పిల్లర్లతో తయారైన ఈ భవనం మధ్యలో సెంట్రల్ హాల్, చుట్టూ మూడు హాఫ్ సర్కిల్ ఛాంబర్లు ఉంటాయి. మరో నాలుగేళ్లలో వందేళ్లకు చేరుకోబోబోతున్నఈ పాత పార్లమెంట్ భవనం ఎన్నో చారిత్రక ఘటనలు, మరెన్నో సంచలన చట్టాలకు వేదికగా నిలిచింది. దేశంలో 75 ఏళ్లుగా ఎన్నో ఘట్టాలకు, చట్టాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పాత పార్లమెంట్ భవనం ఇక మూగబోయింది. ఇక్కడ సభ్యుల సందడి ఉండదు. బడ్జెట్ కేటాయింపులు ఉండవు. తీర్మానాలు జరగవు. 75 ఏళ్లుగా పాత పార్లమెంట్లో కీలకమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనం
స్వతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ఇన్నాళ్లు దేశ సౌర్వభౌమాధికారానికి నిలువెత్తు నిదర్శనంగా ఠీవిగా రాజసం ఒలికిస్తూ నిలబడిన పాత పార్లమెంట్ భవనం ఇక ఆ సందడి కోల్పోనుంది. కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. పాత పార్లమెంట్ భవనం సాక్ష్యంగా నిలిచిన కొన్ని ఘట్టాలను , కొన్ని వివాదాస్పద చట్టాలను అమలు చేసింది.
–1929లో విప్లవకారుడు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ పార్లమెంట్‌పై బాంబు విసిరి అప్పట్లో సంచలనం రేపారు.
–1946 డిసెంబర్ 9వ తేదగీన రాజ్యాంగ సభ తొలి సమావేశం ఇక్కడే జరిగింది
–1947లో బ్రిటీషు ప్రభుత్వం నుంచి భారతావనికి జరిగిన అధికార మార్పిడికి ఈ భవనం సాక్షిభూతంగా నిలిచింది.
–1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఇదే భవనంలో అందరి సభ్యుల మధ్య ఆమోదం పొందింది.
–1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం ఇక్కడే అమల్లోకి వచ్చింది.
–మొదట్లో సుప్రీంకోర్టు కార్యకలాపాలు కూడా ఈ భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే సాగాయి. అప్పట్లో యూపీఎస్సి కార్యాలయం కూడా ఈ భవనంలోనే ఉండేది.
–2001లో పాకిస్తాన్ సహకారంతో లష్కరే తోయిబా తీవ్రవాదులు జరిపిన దాడి ఈ పాత పార్లమెంట్ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలింది.
ఈ పాత పార్లమెంట్ లో నెలకొన్న వివాదాలు – రూపొందించబడిన సంచలన చట్టాలను పరిశీలిస్తే …
–1956లో ది స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ . దేశంలో కొంతమంది వ్యతిరేకించినా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన చట్టం. ఈ చట్టం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
–2000లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పునర్విభజన చట్టం చేయబడింది. ఈ మూడు చట్టాల ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఘండ్ రాష్టాలు ఏర్పాటయ్యాయి.
–2014లో ఏపీ పునర్విభజన చట్టం చేశారు . ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి తలొగ్గి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ రూపొందిన చట్టం ఇది.
–2019లో జమ్ము-కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ జరిగింది. జమ్ము కశ్మీర్ సంస్థానం ఇండియాలో విలీనం సందర్భంగా ఆ రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం.
–2019లో ది సిటిజన్‌షిప్ ఎమెండ్మెంట్ యాక్ట్. దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన చట్టం. ముస్లిమేతర విదేశీయులైన క్రైస్తవ, బౌద్ధ, జైన, పార్శీ, హిందూ, సిక్కు మతస్థులకు భారతదేశ పౌరసత్వం కల్పించే చట్టం. మతం ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే వివాదాస్పద చట్టం గా మారింది.
–2019లో ది ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. ముస్లిం వివాహాల్లో ఉండే త్రిపుల్ తలాక్ పద్ధతికి వ్యతిరేకంగా ఆ విదానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ఇది. దీన్ని త్రిపుల్ తలాక్ చట్టంగా అభివర్ణిస్తారు.
కొత్త పార్లమెంట్ భవనం
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంపై 2010లో ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో భవన నిర్మాణంపై పలు ప్రశ్నలు రేకెత్తాయి. దాంతో 2012లో అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2019లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్తా రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. అదే ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకున్న భవనం. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం అంగరంగ వైభవంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో వైరల్ అవుతోంది. వందేళ్లుగా శాసనాలు రూపొందిస్తూ పాలన సాగిస్తున్న పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంట్ రూపుదిద్దుకుంది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించిన కొత్త పార్లమెంట్.. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్థుల్లో ఉంటుంది. ఒకేసారి ఎంపీలందరూ కూర్చునేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. వారందరూ కలిసి కూర్చునేందుకు అనువైన నిర్మాణం చేపట్టారు.