ప్రముఖ సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ అనారోగ్యంతో గుర్గావ్లో ఫోర్టిస్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శరద్ యాదవ్ నిన్న (గురువారం) రాత్రి కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. శరద్ యాదవ్ సోషలిస్ట్ నేత.. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కి ప్రియ శిష్యుడు. జేపీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేయగా.. శరద్ యాదవ్ గురువు వెంటే ఉన్నారు. విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. కాంగ్రెస్ పార్టీకి, ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై గళమెత్తారు. తుదిశ్వాస వరకు ప్రజల కోసమే పనిచేసిన జననాయకుడు శరద్ యాదవ్.
సామాజిక సమస్యలపై పోరాటం నందకిశోర్ యాదవ్, సుమిత్రా యాదవ్ దంపతులకు శరద్ యాదవ్ 1947 జూలై 1వ తేదీన జన్మించారు. వీరి స్వస్థలం మధ్యప్రదేశ్‌లో గల హొసంగాబాద్ జిల్లా బాబాయ్ గ్రామం. జబల్ పూర్లోని రాబర్ట్ సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, జబల్ పూర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ విద్యావేత్తగా, వృత్తిపరంగా ఇంజినీర్. అందుకోసమే సామాజిక సమస్యలపై పోరాటం చేశారు. రాజకీయ నేతగా జనం కోసం గళం ఎత్తారు. 1989 ఫిబ్రవరి 15వ తేదీన రేఖా యాదవ్‌ను శరద్ యాదవ్ పెళ్లిచేసుకున్నారు. వీరికి ఓ కూతురు సుభాషిణి రాజా రావు, కుమారుడు శాంతాను బుందెలా ఉన్నారు. సుభాషిణి 2020 బీహర్ ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. బిహరిగంజ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. శాంతాను బుందెలా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. లండన్ యూనివర్సిటీ నుంచి పీజీ చేశారు.
నితీశ్‌తో విభేదాలు
శరద్ యాదవ్ మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఏడుసార్లు లోక్ సభ సభ్యుడిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మొత్తంగా 10 సార్లు సుధీర్ఘ కాలం ఎంపీగా పనిచేశారు. 1974 నుంచి జబల్ పూర్ లోక్ సభకు బై పోల్ ద్వారా విజయం సాధించడంతో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజా జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత లోక్ సభ.. లేదంటే రాజ్యసభకు ఎంపిక అవుతూనే ఉన్నారు. సుధీర్గ కాలం పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. వాజ్ పేయి హయాంలో కూడా మంత్రిగా విధులు నిర్వర్తించారు. జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడిగా 2003లో శరద్ యాదవ్ ఎన్నికయ్యారు. 2017లో నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విషయం శరద్ యాదవ్‌కు నచ్చక పార్టీ సమావేశం నిర్వహించగా.. నితీశ్ కుమార్ వర్గం వేటు వేసింది. నితీశ్ కుమార్ వర్గానిదే జేడీయూ పార్టీ అని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆయన బయటకు వచ్చి 2018లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. గత ఏడాది మార్చిలో ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నానని శరద్ యాదవ్ ప్రకటించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఇది తొలి అడుగు అని ప్రకటించారు.
లాలుప్రసాద్తో దోస్తి
నితీశ్ కుమార్‌తో కలిసి పనిచేసినా శదర్ యాదవ్‌ను చివరికి ఆయనే దూరం చేశారు. పార్టీ నితీశ్ హస్తగతం కావడంతో మరో పార్టీని ఏర్పాటు చేశారు. తన రాజకీయ చివరి దశలో ప్రత్యర్థి అయిన లాలుప్రసాద్ యాదవ్‌తో చేతుల కలిపారు. తన లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని ఆర్జేడీలో విలీనం చేశారు. శరద్ యాదవ్ బీహర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నిత్యం సామాజిక సమస్యలపై పోరాడారు. ఏ పార్టీలో ఉన్నా సరే.. తాను ఎంచుకున్న సిద్దాంతం కోసమే పనిచేశారు. ఆరోగ్యం సహకరించకున్న విపక్షాలను ఏకం చేసేందుకే లాలు ప్రసాద్ యాదవ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దం అయ్యారు. అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మృతి భారత జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని సహచరులు, నేతలు గుర్తుచేసుకుంటున్నారు. శరద్ యాదవ్ లేని లోటు తీర్చలేనిదని అంటున్నారు. భారత రాజకీయ ముఖచిత్రంపై శరద్ యాదవ్ తనదైన ముద్ర వేశారు.