తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పదవీ గండం పొంచి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కోటాలో తన కుమారుడు లోకేశ్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెట్టాడు లోకేశ్. ఆ వెంటనే చంద్రబాబు కుమారుడికి మంత్రి బాధ్యతలు అప్పగించాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో లోకేశ్ మంత్రి పదవి కోల్పోయి కేవలం ఎమ్మెల్సీగా మిగిలిపోయాడు.
ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయగా ఆర్కే చేతిలో లోకేశ్ ఓడిపోయాడు. తొలిసారి ప్రజాక్షేత్రంలోకి దిగి చేదు ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. అయితే ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ మార్చి 29తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్న 21 స్థానాల్లో లోకేశ్ ది కూడా ఒకటి. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన లోకేశ్ తిరిగి ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే శాసనసభలో టీడీపీకి ఉన్న బలం 23. తిరిగి ఎమ్మెల్సీని సొంతం చేసుకోవాలంటే ఈ బలం చాలదు. ఇక స్థానిక కోటాలో ఖాళీ అయ్యే 9 ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీడీపీ తిరిగి నిలబెట్టుకునే పరిస్థితి లేదు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేలా కోటాలో ఏ రకంగా చూసినా వైఎస్సార్సీపీ సంపూర్ణ బలంతో ఉంది. దీంతో ఎలా చూసినా లోకేశ్ తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే చాన్స్ లేదు. పదవీకాలం ముగియగానే లోకేశ్ ఎలాంటి చట్టసభకు ప్రాతినిధ్యం వహించడు. తిరిగి చట్టసభలోకి ఎన్నిక కావాలంటే అది అసెంబ్లీ ఎన్నికల ద్వారానే సాధ్యం.
వైఎస్సార్సీపీలో పదవుల పందేరం
ఆంధ్రప్రదేశ్ లో మే 1వ తేదీ వరకు మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా.. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన మరికొందరు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. అయితే ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల స్థానాలన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలో పడనున్నాయి. దీంతో ఈ పదవుల కోసం వైఎస్సార్సీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అవకాశం కోసం ఆశావహులు పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పార్టీ మాత్రం అన్ని సామాజికవర్గాలకు సమ ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నది. గతంలో పదవులు దక్కని వారికి ఈసారి అవకాశం కల్పించాలని చూస్తున్నది. పార్టీపై అసమ్మతితో ఉన్న వారికి కూడా కొంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.