మునుగోడు(Munugode) ఉప ఎన్నిక కోసం ఇటీవల ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ఫలితం రేపు విడుదల కానుంది. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా… ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండనుంది అనే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఫలితం తమకు అనుకూలంగా రానుందని ఆయనకు అందిన నివేదికలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి.
బూతుల వారీగా పోలింగ్ లెక్కలు తెప్పించుకుని అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎన్ని ఓట్లు వస్తాయి ? అనే దానిపై వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించటం ఖాయమని ఆ పార్టీ భావిస్తోందట. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదు కావటం తమకు కలిసి వస్తుందని నేతలు చెబుతున్నారు.
సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గంలో కారు గుర్తుకు 50 శాతానికి పైగా ఓట్లు పడ్డాయని నేతలు అంచనా వేస్తున్నారు.