మునుగోడు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు వేశారు.
ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ పేరు ప్రతిపాదించినా.. కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేయటం ఆశ్చర్యకరంగా మారింది. అధికారుల నుంచి అందుతున్న సమచారం మేరకు మునుగోడులో మొత్తం 56 మంది అభ్యర్ధులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా, రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.
నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ అభ్యర్దిగా రేసులో ఉన్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి.
టీఆర్ఎస్ మొత్తం మంత్రులు ..ఎమ్మెల్యేలను మునుగోడులో మొహరించారు. బీజేపీ నుంచి కోర్ కమిటీ నిత్యం మునుగోడులో పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావటంతో..ఓటర్లను ఆకట్టుకొనేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.