అన్నమయ్య: రాజంపేట – తిరుపతి మెయిన్ రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని అర్బన్ CI నాగార్జున తెలిపారు. రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. మద్యం విక్రయిస్తున్న రాజంపేట(M) వెంకట రాజంపేటకు చెందిన పల్లెపాగు శివయ్యను అరెస్టు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
BPT: వేటపాలెం బైపాస్‌లోని గాయత్రి రెస్టారెంట్ సమీపంలో జాతీయ రహదారి-216పై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజేటి నగర్‌కు చెందిన పఠాన్ యాసిన్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని AP 29S 6868 నంబర్ గల కారు వెనుక నుంచి ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
MLG: ఏటూరునాగారంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళా నేత కుటుంబ సభ్యుడిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబంపై ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయకుండా స్థానిక నేతలు ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కేసు పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు సమాచారం. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
KRNL: దేవనకొండ మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం నంద కిషోర్ (9) అనే బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో, బాలుడు ఒంటరిగా పొలం వద్ద ఉన్న విద్యుత్ నియంత్రిక కట్టపైకి ఎక్కడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం అందించగా, ఆసుపత్రికి తరలించినా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
SRCL: రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని చెప్పారు.
NDL: డోన్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, రాత్రి గస్తీ సమయాల్లో ప్రజలు నుంచి వస్తున్న ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పరిరక్షణలో పోలీసులు అండగా నిలవాలన్నారు. అటు, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను MLA ఆదేశించారు.
HYD: నగరంలోని పలు ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాగోల్, కొండాపూర్, మేడ్చల్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో కొండాపూర్‌లో 150 ప్రింటెండ్ ఆర్సీలు, డీఎల్లను స్వాధీనం చేసుకోగా, నాగోల్ కార్యాలయంలో ఏజెంట్ల వద్ద రూ.2.41 లక్షల నగదు పట్టుబడింది.
KMM: రాష్ట్ర రెవెన్యూ శాఖ బదిలీల్లో భాగంగా జిల్లాకు చెందిన ఇద్దరు తహసీల్దార్లకు పదోన్నతులతో కూడిన పోస్టింగులు లభించాయి. జిల్లా తహశసీల్దార్‌లు వి.రవికుమార్‌ను ములుగు డీఆర్వోగా ప్రభుత్వం నియమించింది. ఎం.రమాదేవిని నల్గొండ భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
PPM: ఎల్విన్ పేట CI హరి బుధవారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడులో రహదారి భద్రత, సైబర్ నేరాలు నియంత్రణపై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రాజెక్టర్ ఏర్పాటు చేసి వీడియో ద్వారా గ్రామస్తులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ చట్టాలను వివరించి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియపరిచారు. మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే అనర్థాలను వివరించారు.
SKLM: పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గురువారం నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ మధుసూదనరావు తెలిపారు. ఉత్తమ బోధనతో పాటు ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
KNR:కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు ఏఎస్సైలకు ఎస్ఐలుగా తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్- 3 సీనియారిటీ జాబితా ఆధారంగా ఈ ప్రమోషన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. పదోన్నతి పొందిన అధికారులను కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట కమిషనరేట్లకు కేటాయించారు.
PDPL: పౌరసరఫరాల మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:45కు పెద్దపల్లికి చేరుకుని అక్కడి నుంచి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తిరిగి 2:45కు హనుమకొండకు బయలుదేరి వెళ్తారని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
కడప: ప్రొద్దుటూరులో గంజాయి సరఫరా చేస్తున్న బీహార్ వాసి గంగూలీని స్థానిక 2 టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి 200 గ్రాముల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు CI వంశీనాథ్ తెలిపారు. రూరల్ CI నాగభూషణ్ నైట్ బీట్ రౌండ్స్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న గంగూలీని పట్టుకొని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
W.G: తెలిసీ తెలియని వయసులో వాహనాలు నడిపి జీవితాలను నాశనం చేసుకోవద్దని భీమవరం వన్‌టౌన్ సీఐ అనిశెట్టి రమేష్ హెచ్చరించారు. బుధవారం రాత్రి ప్రకాశం చౌక్ కూడలిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన పత్రాలు, లైసెన్స్ లేని వారికి జరిమానాలు విధించారు. పట్టుబడిన మైనర్లకు సీఐ కౌన్సెలింగ్ ఇస్తూ.. మళ్లీ రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
GDWL: ముస్లిం సోదరుల పవిత్ర పండుగ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, సహనానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రజలందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.