SRD: కార్మికులు కర్షకుల సమస్యలపై పోరాటాలు చేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం రేతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.
WNP: కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామంలో లబ్ధిదారులు రాధ, మణెమ్మల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.
VZM: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఈ. మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా, కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
HYD: గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 4 కేజీల ఎండు గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
BDK: బూర్గంపాడు మోరంపల్లిబంజర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం గ్రామంలో పట్టపగలే బహిరంగంగా జరుగుతున్న ఇసుక లోడింగ్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.
KDP: వేంపల్లె(మం) నాగూరులో బుధవారం ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గురువారం టీడీపీ ఇంఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డికి ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
HNK: వేలేరు మండలం పరిధిలోని ఎర్రబెల్లిలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ధరావత్ రాజ్ కుమార్ (30) అనే యువకుడు తన పిన్నిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చి ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగ్రహించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే, డ్యూ ప్రభావం మ్యాచ్ మీద పడకుండా ఉండటం కోసం స్టేడియం సిబ్బంది.. ‘డ్యూ కూర్’ అనే రసాయనాన్ని మైదానంలో స్ప్రే చేశారు. ఈ కెమికల్‌ను అమెరికా నుంచి తెప్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఫీల్డింగ్ టీమ్‌కు డ్యూతో ఇబ్బంది ఉండదు.
ASR: అనంతగిరి మండలంలో కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. డముకు, నిమ్మలపాడు నుంచి పెద్దబిడ్డ వరకు జరుగుతున్న తారు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అనంతగిరి పీహెచ్‌సీని పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం చెరుకుబిడ్డ ఎంపీపీ పాఠశాల పరిశీలించారు
VKB: పెద్దేముల్ మండల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శంకర్‌ను వికారాబాద్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసిన ప్రశాంత్ వర్ధన్‌ను తిరిగి నియమించారు. ఎస్సై శంకర్ తన మూడు నెలల కాలంలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసి ప్రజల మన్ననలు పొందారు. కాగా, కొత్తగా నియామకమైన ఎస్సై ఈరోజే బాధ్యతలు స్వీకరించనున్నారు.
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
AP: గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఈ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. మహాకుంభమేళ తరహాలో ఈ పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాలకు దాదాపు 8-10 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు.
BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన మూతి నాగరాజు రమణి దంపతుల కుమారులు మను శ్రీ విష్ణు వర్ధన్ దొర, రిత్విక్ శ్రీ వర్ధన్ దొరల పంచకట్టు వేడుక గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం పంచకట్టు వేడుక అని అన్నారు.
TG: మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని, 60ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
NTR: విజయవాడలో మూడో రోజు లెజిస్లేటివ్ క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. క్రికెట్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్, మ్యూజికల్ చైర్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, కబడ్డీ, చెస్, వాలీబాల్, షాట్‌పుట్, త్రోబాల్ పోటీలు నిర్వహించారు. వివిధ క్రీడల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడుతూ ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.