BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు దమ్మపేట మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి వట్టి వెంకట్రావు నేడు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్ హెచ్ జి భవన శంకుస్థాపన, జిపిఎస్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన, అంగన్వాడి భవనం ప్రారంభోత్సవం, సిసి రోడ్డు శంకుస్థాపన, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.
NTR: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ స్టేట్ టెలిస్టులేటివ్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని ఈరోజు హాజరై క్రీడలు ఆడుతున్న ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు నిర్వహించాలనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆలోచన రాబోయే కాలంలో లెజిస్లేటివ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పునాది కావాలని ఆకాంక్షించారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం కడప నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సీ.)గా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ చంద్రం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. నగర అభివృద్ధి, పారిశుధ్యం, పౌర సేవలపై పరస్పరం చర్చించినట్లు తెలిసింది.
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం విశేష వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం మహోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:00 గంటలకు పుష్పయాగము, ద్వాదశి ఆరాధన, దేవతోద్వాసన, ధోపోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ దేవాలయం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వ్యయంతో భక్తుల కోసం 5 వసతి గృహలు, కాటేజీలు, 10 షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసారు. వీటిని మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేశామని, సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు.
WNP: పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తాండాలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్వేతాచల శ్రీనివాస స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
NZB: మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని బిక్కనూర్ ఎంఈవో రాజగంగారెడ్డి ఆదేశించారు. గురువారం బస్వాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన భోజనం అందించకపోతే ఏజెన్సీలు రద్దు చేస్తామని హెచ్చరించారు.
NLG: చిట్యాల 1వ వార్డుకు చెందిన మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ ఎడ్ల పద్మ, కాంగ్రెస్ నాయకుడు మహలింగం యాదవ్ దంపతులు మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించామని, దీనిపై విద్యాసాగర్ సానుకూలంగా స్పందిస్తూ.. నేను ఉన్నాను, అంటూ ధైర్యం చెప్పారని వారు పేర్కొన్నారు.
W.G: మండల కేంద్రం అయిన ఉండి హైస్కూల్లో క్లినికల్ సైకాలిజిస్ట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురికాకుండ చూసుకోవాలని కోరారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైక్రియాట్రిక్, సోషల్ వర్కర్ సుమన్ బాబు మాట్లాడుతూ.. 11416 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. సునంద, కృష్ణ కుమార్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
HNK: పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణం, 5000 మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. రైతులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
కోనసీమ: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. 40 కేంద్రాల్లో ఇంగ్లీష్ సెట్-2 ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,885 మందికి గాను 11,549 మంది హాజరయ్యారని, 336 మంది గైర్హాజరైనట్లు DIEO చంద్రశేఖర్ బాబు తెలిపారు. 97% మంది పరీక్ష రాశారని, జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.
BHPL: నాలుగో వార్డులో ఇలాంటి బాధ్యత లేని కాంగ్రెస్ నాయకులు రవీందర్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయడం సరికాదని 4వ వార్డు కౌన్సిలర్ యుగంధర్ విమర్శించారు. గురువారం సాయంత్రం కౌన్సిలర్ మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పంపిణీ చేయాల్సిన మంజూరు పత్తులను అర్హత లేని నాయకులు పంపిణీ చేయొద్దన్నారు. రవీందర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
BDK: క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు పోటీ పడుతూ విజయం సాధించేందుకు కృషి చేయాలని మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి అన్నారు. గురువారం జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పినపాక ప్రజాప్రతినిధులు, కరకగూడెం జర్నలిస్టులకు మధ్య జరిగిన మ్యాచ్‌లో కరకగూడెం జర్నలిస్టులు విజయం సాధించారు.
VSP: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం “స్వర్ణాంధ్ర- 2047” లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.