SRCL: చందుర్తి మండలం లింగంపేట శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీని శనివారం గ్రామ సర్పంచ్ కొక్కుల నరేష్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఐలేని వేణుగోపాలరావు, ప్రధాన కార్యనిర్వహణాధికారిగా జలగం వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులుగా దొకే రాజయ్యలను ఎన్నుకున్నారు.
NTR: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ రామాలయంలో సీతారామ నామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 73వ రామకోటి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి విశిష్టత, రామనామ మహిమ, రామకోటి మహోత్సవం ప్రాముఖ్యత గురించి వారు వివరించారు.
WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశాల మేరకు శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని మేడపల్లి ZPSS హై స్కూల్‌లో విద్యార్థులకు స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాహసీల్దార్ ముప్పు కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్ఫూర్తి కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో తోడ్పడుతుందని అన్నారు.
TG: రేపు కలెక్టర్‌తో సీఎం రేవంత్ సమావేశం వాయిదా పడింది. మార్చి 4 లేదా 5న సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు వంటి సంక్షేమ పథకాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ధరణి సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల బలోపేతం చర్చించనున్నారు. ఈ సమావేశ అధికారిక తేది త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
సిద్దిపేట: చేర్యాల పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న మిషన్ భగీరథ నీటి సమస్య పరిష్కారమైంది. ఎన్నికల నుంచి నీరు రాక కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులపై నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి తక్షణమే స్పందించారు. పదవి చేపట్టిన మరుసటి రోజే పైప్‌లైన్ మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.
JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సర్పంచ్ పుల్లూరు ఉమాదేవి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 85 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 30 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి ఆసుపత్రికి తరలించినట్లు లయన్స్ క్లబ్ సభ్యుడు అంగడి ఆనంద్ తెలిపారు.
ASF: జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని NHM JAC నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజకు వినతిపత్రం అందజేశారు. 78 కేడర్లలో సేవలందిస్తున్న తమను ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రమబద్ధీకరించారని, తెలంగాణలోనూ అదే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
VZM: గజపతినగరం గ్రామపంచాయతీలో కుళాయిల ద్వారా నీటి వృధా నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మేటి కోటి భాస్కరరావులు శనివారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోకి అందజేసిన వినతి పత్రంలో కోరారు. తాగునీటి కొళాయిలకు టాపు వాల్వు లేకపోవడంతో నీరు వృధాగా పోతున్నట్లు చెప్పారు.
SRPT: హరిత కోదాడ నర్సరీలతోనే సాధ్యం అవుతుందని, అధికారులు, సిబ్బంది నర్సరీల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తీసుకోవాలని కోదాడ తాజా మునిసిపల్ ఛైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ఉత్తమ్ పద్మావతి నగర్‌లో నర్సరీ, వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు.
సత్యసాయి: పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన శనివారం బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లాలోని పురోహితులు, పాస్టర్లు, కాజీలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో ఆధార్ కార్డు కాకుండా అమ్మాయి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.
సిద్దిపేట: జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని వీరన్నపేట గ్రామ పాలకవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పెండింగ్ సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
NGKL: ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. జిల్లాలో మొత్తం 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. 159 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం తనిఖీ చేశారు. గదులు, గ్రంథాలయం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలుగుబంట్ల సంచారం, వీధి దీపాల కొరతపై స్పందిస్తూ వారంలోగా కంపచెట్లు తొలగించి విద్యుత్ దీపాలు వేయిస్తానని హామీ ఇచ్చారు.
కోనసీమ జిల్లాలో కొబ్బరి ధర రోజు రోజుకి పతనం అవుతుంది. గత నెలలో ఒక్కో కొబ్బరికాయ ధర రూ. 21 నుంచి రూ. 24 వరకు పలికింది. కొబ్బరికాయ ధర రూ.16 నుంచి రూ.18కి పడిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడమే ధర పతనానికి కారణమని వ్యాపారస్తులు అంటున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KKD: పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, పగడాల ప్రవీణ్ కుమార్ సందర్శించారు. వారు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ EO జగన్మోహన్ వారికి స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు.