ATP: జిల్లాను వంద శాతం అక్షరాస్యత దిశగా మార్చడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో ‘అక్షర ఆంధ్ర’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఏడాది జిల్లాలో 1.25లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. అక్షర కేంద్రాలను అధికారులు సందర్శించి హాజరు శాతాన్ని పెంచాలని ఆదేశించారు.
తూ.గో: రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
కడప: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 28న డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.
GDWL: అయిజ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఫైర్ స్టేషన్ ఏర్పాటుతో సమీప మండలాలకు అత్యవసర సమయాల్లో సహాయం అందుతుందని పేర్కొన్నారు. వినతిపత్రం సమర్పణలో నాగర్ దొడ్డి వెంకట రాములు, కురువపల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
W.G: భీమవరంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మాస్ కాపీయింగ్ జరుగుతుందా అనే కోణాల్లో పట్టణంలోని కళాశాలలో తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, సౌకర్యాల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలించారు.
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది ప్రజలు కేంద్ర మంత్రికి తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు. వాటిని పరిశీలించి, అవసరమైన వాటిని సత్వరమే పరిష్కరించారు.
KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యాన్ని పక్కదారి పట్టించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని AISF నాయకులు ఇవాళ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
VZM: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంకలాం లేఔటులో “కార్డన్ అండ్ సెర్చ్” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇంఛార్జ్ డీఎస్పీ ఆర్. గోవిందరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఒకేసారి ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. రికార్డులు సక్రమంగా లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, 8 మందిని అరెస్ట్ చేశారు.
JGL: గ్రీవెన్స్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
MDK: తూప్రాన్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం, ప్రస్తుతం వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన చేపట్టారు. పంటలలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రతాప్ రెడ్డి వివరించారు. నేలలో సేంద్రియ కర్బనం ప్రాముఖ్యత గురించి, దానిని ఎలా పెంచుకోవాలో తెలిపారు.
KDP: పులివెందులలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ దాడి నిర్వహించింది. లంచం తీసుకుంటున్న సమయంలో రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై అనిల్ కుమార్‌లను అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్మును సీజ్ చేసి, కేసుపై విచారణ కొనసాగుతోంది.చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో కులం పేరుతో రజాక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని BSP జిల్లా అధ్యక్షుడు బస్కే నాగరాజు ఖండించారు. సోమవారం సాయంత్రం నర్సంపేటలో BSP నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో చనిపోయిన పసికందుకు నివాళులర్పించారు. నాగరాజు మాట్లాడుతూ.. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని హత్య చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని పోల్కంపల్లి ఏఈవో శివ తెలిపారు. రైతులు ఆధార్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫార్మర్ రిజిస్ట్రీ స్థితిని పరిశీలించుకోవచ్చన్నారు. లింక్‌లో ‘Approved’ లేదా ‘Pending’గా చూపితే నమోదు పూర్తైనట్లేనని స్పష్టం చేశారు. ప్రయోజనాల కోసం వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
KMR: లింగంపేట మండలం ముస్తాపూర్ పరిధిలో కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిలో నోటీసులు అందజేసినప్పటికీ శివాజీ విగ్రహం ఏర్పాటు చేపట్టడంతో లింగంపేట ఎమ్మార్వో కార్యాలయానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైందవ సమాజాన్ని మేల్కొలిపిన శివాజీ విగ్రహ ఆవిష్కరణను ఆపివేయించడం తగదని పలు సంఘాలు మండిపడుతున్నాయి.
HNK: చదువు మన తలరాతను మారుస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ మర్కజి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా బాలవికాస సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు.