VSP: జూ పార్క్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. మధురవాడ వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బొలెరో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలిక ఉన్నత పాఠశాలలో టీడీపీ సీనియర్ నేత కోదండరామిరెడ్డి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంఈవో దిలీప్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని పరీక్ష సామాగ్రిని అందజేశారు. పాఠశాలలో ఉన్న 151 మంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
AKP: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ బాధ్యతలు దక్కడంపై మాడుగుల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
SRD: యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలనీ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. బుధవారం సహచర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి సింగూర్ డామ్ పై సమీక్షించారు. సింగూరు ప్రాజెక్టు సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేసి జులై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలన్నారు.
HNK: టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో లైన్ మెన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజినీర్ పి.మధుసూదన్ రావు అమరవీరుల స్తూపం వద్ద శాఖాధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజినీర్లు ఏ.విజయేందర్ రెడ్డి, జి.సాంబారెడ్డి, పి.మల్లికార్జున్ తదితర అధికారులు పాల్గొన్నారు.
KMR: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన కొర్వి సాయిలు తీవ్ర అనారోగ్యంతో శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా బుధవారం MLA మదన్ మోహన్ వెంటనే స్పందించారు. ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ. 2,50,000 లక్షల LOC మంజూరు చేయించారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేకు సాయిలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
AP: లడ్డూ నెయ్యిలో జంతుకొవ్వు ఉందని NDDB నివేదికలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ‘జగన్‌కు శ్రీవారంటే నమ్మకం లేదు.. సభలో రాజకీయం చేయొద్దు. లడ్డూ నెెయ్యి కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారు. 2019-24 మధ్య లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించాలి. సభను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది. సంబంధం లేని కంపెనీ పేర్లు ప్రస్తావించడం సరికాదు’ అని పేర్కొన్నారు.
VZM: వేసవి దృష్ట్యా వడదెబ్బ వచ్చే అవకాశమున్నందున ప్రజలందరూ తప్పనిసరిగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని DMHO డాక్టర్ ఎస్. జీవన రాణి ఒక ప్రకటనలో తెలిపారు. బయటకు వెళ్ళినప్పుడు గొడుగు, తెలుపురంగు లేదా పలుచటి చేనేత వస్త్రాలు ధరించాలాన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడిచి గాలి తగిలేలా చూడాలన్నారు.
MDK: నార్సింగి మండల ఇంఛార్జ్ ఎంపీడీవోగా చెన్నారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈతరం యవతీ యువకులతో పోలిస్తే.. 1990లలో పుట్టిన వారు ఆరోగ్యంగా, ఆనందంగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. కారణం వారి బాల్య జీవితమంతా ఎక్కువ భాగం ప్రకృతితో సంబంధం కలిగి ఉండటమే! ఈతరం వారితో ప్రకృతితో సంబంధాలు 60%కి పైగా తగ్గిపోయాయట. దీనినే ‘extinction of experience’ అనే సమస్యగా అభివర్ణిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, పని, ఉపాధి, ఉద్యోగాల వంటివి కారణం అవుతున్నాయి.
CTR: SRపురం(M) మిట్టహరిజనవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో నవీన్‌కు చెందిన ఐదెకరాల చెరుకు పంట దగ్ధం అయింది. బాధితులను వైసీపీ నేత నారాయణస్వామి, నియోజకవర్గ ఇంఛార్జ్ కృపాలక్ష్మి పరామర్శించారు. బాధితులను కలెక్టర్ ఆదుకోవాలని వారు కోరారు. ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, బాధితులు మరో ఐదేళ్లు కోలుకునే అవకాశం లేదన్నారు.
KMM: చింతకాని మండలం తిరుమలాపురం అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం సర్పంచ్ చాపలమడుగు వీరబాబు సందర్శించారు. కేంద్ర నిర్వహణ, చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
TG: మాజీ సీఎం KCR జాతీయ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఆయన ఢిల్లీ పర్యనటకు వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో CMలు స్టాలిన్, మమతా బెనర్జీలు, పినరయి విజయన్‌లతో చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో ఢిల్లీలోని BRS కేంద్ర కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నారు.
SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో క్రాస్ రోడ్ నుంచి పాత ఊరు వరకు ఏర్పాటు చేసిన సోలార్ ఐమాస్ట్ లైట్లు కొన్ని స్తంభాలకు వేలాడుతూ, మరి కొన్ని స్తంభాలకు పని చేయకుండా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో రహదారంతా చీకటి అలుముకుని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున, అధికారులు స్పందించి వాటి స్థానంలో నూతన లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అన్నమయ్య: వైసీపీలో బడుగు బలహీన వర్గాలను విస్మరించి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాషా ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తోందని తెలిపారు.