WNP: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మండలంలో పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్ సుగుణ అన్నారు. ఘణపురం మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు.
E.G: జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించిందనీ, మొత్తం 233 మంది పాత్రికేయులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వైద్య శిబిరం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం నిర్వహించారు. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శుక్రవారం శ్రీ రామనవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, శని, ఆదివారాల్లో సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి 30న సోమవారం మార్కెట్ యథావిధిగా పునః ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కావున రైతులు, వ్యాపారస్థులు, కార్మికులు సహకరించగలరని పేర్కొన్నారు.
ATP: అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను ఏపీ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు వెంకటప్ప కలిశారు. జిల్లాలోని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. కిలిమంజారో పర్వతం అధిరోహించిన చిన్ని కృష్ణ నాయక్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. గిరిజన సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిధిలోని నేరాలు, రౌడీ షీటర్లు, పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని, పెండింగ్ కేసులపై విచారణ జరిపి, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పోలీసులను ఆదేశించారు.
NTR: విజయవాడలో జేసీ ఇలాక్కియాకి వైసీపీ నాయకులు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఏ.కొండూరు, మార్కాపురం ప్రాంతాల్లో సీకేడీ తీవ్రత పెరుగుతోందని తెలిపారు. ఏ.కొండూరులో 61.8% మంది బాధితులని, మార్కాపురంలో డయాలసిస్ రోగులు పెరిగారని చెప్పారు. మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని, తాగునీటి వనరులపై శాస్త్రీయ పరిశీలన చేయాలని కోరారు.
TPT: ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ. కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.
GNTR: అమరావతిని రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మార్గంలో కృష్ణానదిపై 5.3 కి.మీ. మేర భారీ రైల్వే వంతెన నిర్మించనున్నారు. రూ.565.83 కోట్లతో చేపట్టే ఈ వంతెన నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 33 నెలల్లో పూర్తి చేయనున్నారు.
VKB: కమిషన్ ఏజెంట్లు, రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తూ న్యాయం చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిషన్ ఏజెంట్ల దుకాణాలను పరిశీలించారు. ఛైర్మన్ మాట్లాడుతూ రైతులకు కొనుగోలు చేసిన ధరలు వాటి కేజీల వివరాలను స్లిప్పులు వేసి అందించాలని ఏజెంట్లకు సూచించారు.
HNK: తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు DMHO డా.అల్లం అప్పయ్య తెలిపారు. నగరంలోని IMA హాల్లో గురువారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించగా, DMHO ప్రారంభించారు. హాజ్ వెళ్లే యాత్రికులకు అన్ని రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వ్యాక్సిన్లు ఇస్తున్నామన్నారు.
SKLM: రణస్థలం మండలం పాతర్లపల్లిలో గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ఈశ్వర్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. యువతకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ‘వెంకీ’ మూవీ విడుదలై నేటితో 22ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం సినిమా కాదు, ఒక మధుర ప్రయాణమని పేర్కొన్నాడు. సహజమైన నైట్ ఎఫెక్ట్ కోసం 70 రోజుల షూటింగ్‌లో, వరుసగా 40 రాత్రులు కష్టపడ్డామని వెల్లడించాడు. రవితేజ అందించిన తిరుగులేని సహకారం వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని అన్నాడు.
KDP: సిద్ధవటం(మం) మాధవరం-1లోని జగనన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు గురువారం గ్రామ సచివాలయ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో రోజువారీ అవసరాలు కూడా నెరవేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.
TG: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగుతోందని.. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 484 ట్రక్కుల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
NRML: జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్న నేపథ్యంలో వారు ఈ ప్రకటన చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.