ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై కాల్పులు జరిపిన ఎఎస్ఐ గోపాల్ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారట. అతని భార్య ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపింది. గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని, మందులు కూడా వాడుతున్నారని పేర్కొంది.
‘ఏం జరిగిందో నాకు తెలియదు. వార్తల్లో చూసి తెలుసుకున్నా. ఘటనా జరిగిన సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. ఈ రోజు ఉదయం నుంచి తాను భర్తతో మాట్లాడలేదని తెలిపింది. ఉదయం తన కూతురు వీడియో కాల్ చేసిందని చెప్పింది. ఐదు నెలల క్రితం చివరిసారి తన భర్త ఇంటికి వచ్చాడు. గత ఏడు, ఎనిమిదేళ్లుగా మానసిక సమస్యకు చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. మందులు వాడిన తర్వాత మాములుగానే ఉండేవారు’ అని గోపాల్ దాస్ భార్య జయంతి దాస్ వివరించింది.
ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ బ్రజ్ రాజ్ నగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్ల వరకు కాల్పులు జరపడంతో మంత్రి సహా మరొ ముగ్గురు గాయపడ్డారు. మంత్రిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తర్వాత విమానంలో భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
మంత్రి నబా దాస్ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లను గోపాల్ దాస్ పర్యవేక్షించాడు. అందుకే దగ్గరి నుంచి కాల్పులు జరిపేందుకు వీలు పడిందట. వెంటనే అక్కడినుంచి దాస్ పారిపోయాడు.. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.