కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి… తెలంగాణ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. తెలంగాణలో ప్రస్తుతం ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, ఇక్కడ ఈడీ, ఐటీ దాడులతో మమ్మల్ని బెదిరించలేరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ బెదిరింపులకు ఎవరు భయపడరని హరీశ్‌రావు అన్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఇటీవల చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణాకి ఎనిమిదిన్న వేల కోట్లు జీఎస్టీ రూపం లో ఇచ్చామని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు మండిపడ్డారు. తెలివి ఉండే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చేది 30 వేల కోట్లయితే,…కేంద్రం ఇచ్చినది 8 వేల కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఎవరు ఎవరికీ నిధులు ఇస్తున్నారో లెక్కలు చెబుతూనే ఉన్నాయని అన్నారు. కిషన్ రెడ్డితో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని హరీశ్‌రావు సవాలు విసిరారు. రాష్ట్రాల పన్నుల వాటా పూర్తిగా తగ్గించారని, పైగా అబద్దాలు చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. కేంద్రం నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడిపైనా లక్షా 24 వేల అప్పు ఉందని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీకు కనపడుతుందా లేదా అని ప్రశ్నించారు.