తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా.
వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి మొదటివారంలో ప్రవేశపెడుతారు. అయితే సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత వేగం మరింత పెరిగింది. ముఖ్యంగా ఖమ్మం సభతో దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మూడు రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు జాతీయ పార్టీల కీలక నేతలు హాజరుకావడంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. అనేక రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నాయి. దీనికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ హయాంలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కావడంతో కేసీఆర్ స్పీడ్ పెంచారు.