తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ పార్టీని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా… ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా పరిచయం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితతో పెద్ద స్కెచ్ ప్లాన్ వేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ జాగృతి తరహాలో భారత్ జాగృతి ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారత్ జాగృతి పేరు రిజిస్టర్ చేశారు. భారత్ జాగృతి పేరుతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించనున్నారు. దీని ఇతర రాష్ట్రాల్లో భారత్ జాగృతి కమిటీలను కవిత ఏర్పాటు చేయనున్నారు.
జాగృతి కార్యక్రమాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా భారత్ జాగృతి పేరుతో కొత్త సంస్ధ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కవిత హైదరాబాద్లో తెలంగాణ జాగృతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్వరలో జాగృతి సంస్ధను దేశ స్థాయికి తీసుకెళ్తున్నామని, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి పని చేయాల్సి ఉంటుందని నేతలకు తెలిపారు. కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రమంలో.. భారత్ జాగృతి పేరుతో దేశస్థాయిలో కవిత ఓ సంస్థను రిజిస్టర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి మధ్య సోదర బంధం ఉంటుందని కవిత చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల సంస్కృతులను గౌరవిస్తూ జాతీయ భావన కొనసాగిస్తామని కవిత చెబుతున్నారు. తెలంగాణలో బతుకమ్మ తరహాలో ఏపీలో అట్ల తద్దె, బిహార్లో ఛత్పూజ లాంటివి ఉన్నాయని, అన్ని సంస్కృతులను గౌరవిస్తామని కవిత స్పష్టం చేశారు.
ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరిస్తామని, అక్కడి ప్రజలకు వ్యతిరేకం కాదన్నారు. కేవలం ఏపీ రాజకీయ నేతలను మాత్రమే ప్రశ్నిస్తున్నామని, ప్రజలను కాదని కవిత తెలిపారు. ఏపీలో కూడా అవసరమైతే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పోటీపై నిర్ణయం తీసుకుంటారని కవిత స్పష్టం చేశారు.