Chocoate:భర్త చాక్లెట్ తీసుకురాలేదని 25 ఏళ్ల భార్య ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని హెన్నూరు బండే సమీపంలోని హొన్నప్ప లేఅవుట్లో చోటుచేసుకుంది. సెలూన్లో పనిచేసే గౌతమ్, అతని భార్య నందిని కాలేజీ నుంచి ఒకరికొకరు తెలుసు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఘటన జరిగిన రోజు గౌతమ్‌ను నందిని పనికి వెళ్లకుండా అడ్డుకుంది. ఆపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నందిని కూడా పని ముగించుకుని వచ్చే టప్పుడు భర్తను చాక్లెట్ తీసుకురావాలని కోరింది. సరే తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన గౌతమ్ నందిని ఫోన్ కాల్స్‌ను ఎత్తలేదని పోలీసులు తెలిపారు.
దాదాపు 11:45 గంటలకు నందిని తన భర్తకు వాట్సాప్ సందేశాలు పంపింది. తాను బయలుదేరుతున్నానని.. తన పిల్లలకు భోజనం పెట్టడానికి.. వారిని బాగా చూసుకోవడానికి త్వరగా రావాలని మెసేజ్‌లో పేర్కొంది. మెసేజ్ చూసి భయపడిన గౌతమ్ నందినికి ఫోన్ చేసినా ఆమె ఫోన్ ఎత్తలేదు. గౌతమ్ ఇంటికి వచ్చి చూడగా నందిని ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనలో నందిని తల్లిదండ్రులు గౌతమ్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. హెన్నూరు పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.