ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఇవే. అయితే నాలుగు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. మధ్యలో ఓ కమర్షియల్ సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతునే ఉంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. అయితే తాజాగా ప్రభాస్ కొత్త ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపాడు ప్రభాస్. కానీ అధికారిక ప్రకటన లేకపోవడంతో.. ఈ కాంబోలో సినిమా ఉందా.. లేదా.. అనేది సందేహంగానే ఉంది. అయితే ఈ మద్యే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుందని ఇండస్ట్రీ టాక్. అందుకే ఇప్పుడు షూటింగ్‌కు వెళ్లడానికి రెడీ అవుతున్నారట. అక్టోబర్ 17నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ కోసం కేవలం వారం రోజులు డేట్స్ మాత్రమే ఇచ్చాడట ప్రభాస్.
అంతేకాదు ఈ షెడ్యూల్లో ప్రభాస్, సంజయ్ దత్ పై కొన్ని సీన్స్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అదుకోసం ఇప్పటికే ఓ భారీ థియేటర్ సెట్‌ను కూడా వేశారట. అయితే ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. అక్టోబర్ 17న ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ రానుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అన్నట్టు ఈ సినిమాకు మొదటి నుంచి ‘రాజా డిలక్స్’ అనే టైటిల్ వినిపిస్తోంది.