»Grandmother Kidney Tranplant To Her Grandson In Karnataka
Transplant: 21 ఏళ్ల మనువడికి 73 ఏళ్ల బామ్మ పునర్జన్మ
కొనప్రాయంతో ఉన్న వారిని అవయవదానంతో కాపాడవచ్చు. ముందే అవయవదానానికి అంగీకరిస్తే దురదృష్టవశాత్తు మనకు ఏమైనా జరిగితే ఆ అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి పునర్జన్మ లభిస్తుంది. ఒకవేళ మనం ప్రమాదానికి గురవడం.. మన అవయవాలు ఏవైనా దెబ్బ తింటే జీవన్ ధాన్ ద్వారా అవయవాల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. మనం ఇతరులు.. ఇతరులు మనకు దోహదం చేసేలా అవయవదానం ఉంటుంది.
అవయవదానం (Organ Donation)పై అవగాహన పెంచుకుంటే కొన ప్రాణంపై ఉన్న వారిని కూడా రక్షించవచ్చు. దేశంలో అవయవదానంపై ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. అవయవాలు దానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. జీవన్ ధాన్ (Jeevandhan) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో అవయవదానం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఇప్పటివరకు నడి వయసు వారు ఈ తంతులో పాల్గొన్నారు. కానీ ఓ వృద్ధురాలు అవయవదానానికి ముందుకు రావడం విశేషం. తన మనుమడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి ఆమె మనసు కకావికలమైంది. తన మూత్రపిండాన్ని (Kidney) ఇచ్చి మనుమడిని కాపాడుకుంది. ఈ సంఘటన కర్ణాటక (Karnataka)లోని బెళగావి (Belagavi)లో జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఉన్నాయి.
కన్నవారు అనారోగ్యం బెళగావిలోని హరుగేరి ప్రాంతానికి చెందిన యువకుడు సచిన్ (21) చిన్నప్పటి నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా అతడి పరిస్థితి మెరుగు కాలేదు. మందులతోనే 21 ఏళ్లు గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం వారానికి రెండుసార్లు డయాలసిస్ (Dialysis) చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచిన్ కు కిడ్నీ మారిస్తేనే బతుకుతాడని వైద్యులు స్పష్టం చేశారు. కిడ్నీ మార్చకపోతే సచిన్ పరిస్థితి రోజురోజుకు తగ్గి పూర్తి అనారోగ్యం బారిన పడతాడని వైద్యులు తెలిపారు. కుమారుడి పరిస్థితిని చూసి చలించిపోయిన తల్లిదండ్రులు తమ కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే విధి వారి చేతిలో లేదు. వాళ్లు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారి కిడ్నీలు సచిన్ కు మార్పిడి చేయలేమని తేల్చి చెప్పేశారు. వారి కిడ్నీలు తీసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారి మూత్రపిండాలు కావాలని చెప్పారు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే యువకుడి అమ్మమ్మ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. మనుమడిని ఆ పరిస్థితిలో ఆమె చూడలేకపోతున్నది. నా చిన్ని తండ్రికి ఎంత కష్టమొచ్చిందని బాధపడింది.
వైద్యుల ప్రశంసలు దీంతో తన మూత్రపిండాలు ఇచ్చేందుకు బామ్మ సిద్ధమైంది. కుటుంబసభ్యులు వద్దని వారించినా ఆమె తన మనుమడిని కాపాడుకోవడం కోసి కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వైద్యులను కలిసి ఆమె ఈ విషయం చెప్పింది. వైద్యులు పరీక్షలు చేసి బామ్మ కిడ్నీలు మార్పిడి (Transplant) చేసేందుకు అనువుగా ఉన్నాయని చెప్పారు. దీంతో బెళగావిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్ రవీంద్ర మద్రాకి నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే 73 ఏళ్ల వయసులో కిడ్నీ దానం చేయడం గొప్ప విషయమని వైద్యులు అభినందించారు. ఆమె స్ఫూర్తితో యువత కూడా అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అవయవదానంతో పునర్జన్మ
ప్రస్తుతం దేశంలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. కొనప్రాయంతో ఉన్న వారిని అవయవదానంతో కాపాడవచ్చు. ముందే అవయవదానానికి అంగీకరిస్తే దురదృష్టవశాత్తు మనకు ఏమైనా జరిగితే ఆ అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి పునర్జన్మ లభిస్తుంది. ఒకవేళ మనం ప్రమాదానికి గురవడం.. మన అవయవాలు ఏవైనా దెబ్బ తింటే జీవన్ ధాన్ ద్వారా అవయవాల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. మనం ఇతరులు.. ఇతరులు మనకు దోహదం చేసేలా అవయవదానం ఉంటుంది. అవయవదానం చేయాలనుకుంటే జీవన్ ధాన్ ప్రతినిధులను సంప్రదించవచ్చు.