భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సీసీ హాజరుకానున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈజిప్ట్ అధ్యక్షుడు పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది. పశ్చిమ ఆసియా, అరబ్ దేశాల నుంచి హాజరైన ఐదో వ్యక్తి అబ్దెల్ అవుతారు. జనవరి 24వ తేదీన అబ్దెల్ ఢిల్లీ చేరుకుంటారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ స్వాగతం పలుకుతారు. ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలుస్తారు. ఆ రోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు హాజరవుతారు.
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు అబ్దెల్ చీఫ్ గెస్ట్‌గా రావడంతో ఈజిప్ట్‌కు చెందిన 180 మంది సైనికులు కవాతులో పాల్గొంటారు. భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేస్తారు. భారత్, ఈజిప్ట్ మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాలకు గుర్తుగా స్టాంప్ విడుదల చేస్తారు. ఈజిప్ట్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు, గోధుమల సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. ఈజిప్ట్‌కు గతంలో భారత్ నుంచి గోధుమలు ఎగుమతి అయ్యేవి కాదు. గత ఏడాది ఈజిప్ట్ నిషేధం ఎత్తివేసిన తర్వాత మూడు విడతల్లో 61 వేల టన్నుల గోధుమలను భారత్ ఎగుమతి చేసింది.
తేజస్, ఆకాశ్ లాంటి అధునాతన తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు ఈజిప్ట్ ఆసక్తి చూపిస్తోంది. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ అధికారులతో ఈజిప్ట్ అధికారులు డిస్కసన్ చేసేందుకు ఛాన్స్ ఉంది.