మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తాజాగా బీజేపీ నేతలు(bjp leaders) ఈసీ(Election commission)కి ఫిర్యాదు చేశారు. నేటితో మునుగోడు ఎన్నికల ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ టీఎన్జీవోలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం టీఎన్జీవోలు అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజాగా టీఎన్జీవో నేతల మీడియా సమావేశ వివరాలను జత చేసారు. తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ నేతల ఫోన్ల ట్యాప్ (phone tapping)చేస్తున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కూడా తరుణ్ చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇప్పటికే టీఎన్జీవోల పైన తెలంగాణ బీజేపీ నేలు హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా కూడా టీఎన్జీవోలు ఇలాగే వ్యవహరించారని.. అందుకు సంబందించి వారికి జరిమానా కూడా విధించారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ప్రచారం చేసినందుకు వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే దానిపైన తాము పోరాటం చేస్తామని చెప్పారు. ఇక, ఈ సాయంత్రానికి బయట నుంచి ప్రచారం కోసం వచ్చిన వారంతా నియోజకవర్గం వీడి వెళ్లాలని ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేసారు.