టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ పార్టీ అధిష్టానం సడెన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 26వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి భావించారు. ‘‘హాత్ సే హాత్ జోడ్ అభియాన్’’ పేరుతో యాత్ర నిర్వహించాలని ఆయన అనుకున్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ…. సడెన్ గా ఆయన యాత్రకు అసలు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని చెప్పడం గమనార్హం.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26 నుండి చేపట్టాలనుకున్న హాత్ సే హాత్ జోడో యాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
ఏఐసీసీ ఇచ్చిన సర్క్యులర్ లో 2 నెలల పాదయాత్ర ఉందని, కానీ జనవరి 26 నుండి 5 నెలల పాటు పాదయాత్ర అని అన్నారన్నారు. అయితే ఎవరి నియోజకవర్గంలో వారే పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిందని… ఈ పాదయాత్రలో ఒక రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.