తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ దాడులపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునిల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఎస్కే కార్యాలయం కంప్యూటర్, లాప్టాప్ లను పోలీసులు సీజ్ చేసారు. గత కొంతకాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. సోదాల సమయంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల సోదాలను కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా లొకేషన్ గుర్తించి సోదాలు నిర్వహించి, సీజ్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. సిబ్బందిని అరెస్టు చేసి, వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ భగ్గుమంటోంది. కాంగ్రెస్ వార్ రూమ్ పైన దాడి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నేడు నిరసనలకు పిలుపునిచ్చారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. కాంగ్రెస్ వ్యవహారంలోకి పోలీసులు తలదూర్చడం సరికాదన్నారు.
కాంగ్రెస్ వార్ రూమ్ పైన దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ ఎంపీలు హెచ్చరించారు. వార్ రూమ్ దాడి పైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోకసభలో వాయిుదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు, కాంగ్రెస్ నిరసన పిలుపుతో ముందస్తు అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. షబ్బీర్ అలీ, మల్లు రవి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రోహన్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ సిద్ధమవడంతో, అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.